అడవిలో నాటుబాంబులు
దొడ్డబళ్లాపురం: దావణగెరె జిల్లా ఫలవనహళ్లి అడవిలో 32 నాటుబాంబులు లభించడం సంచలనంగా మారింది. ఫలవనహళ్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బర్కత్ అలీ గస్తీ తిరుగుతుండగా నాటు బాంబులు కనిపించాయి. అడవి జతువులను వేటాడడానికి వాటిని దాచి ఉంటారని అనుమానాలున్నాయి. సమీపంలో తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని చూసి రెండు బైక్‌లను అక్కడే వదిలి పరారయ్యారు. న్యామతి పోలీసులు విచారణ చేపట్టారు.
తిరుమల దర్శనమని..
ఎమ్మెల్యేకు టోపీ
దొడ్డబళ్లాపురం: తిరుమల ఆలయంలో స్పెషల్ దర్శనం చేయిస్తానని నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు టోకరా వేసిన సంఘటన వెలుగు చూసింది. ఓ ఎమ్మెల్యే మాజీ పీఏ మారుతి నిందితుడు. గతంలో సదరు ఎమ్మెల్యే తరఫున మారుతి శ్రీవారి దర్శనం కోసం పాస్‌లు ఇచ్చేవాడు. తరువాత అతన్ని ఎమ్మెల్యే పనిలో నుంచి తొలగించాడు. నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, ఆయన బంధువులకు స్పెషల్ దర్శనం చేయిస్తానని మారుతి నమ్మించి రూ.8 లక్షలు వసూలు చేశాడు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలమంగల పోలీసులు మారుతిని అరెస్టు చేశారు.
మహదేశ్వర హుండీల్లో రూ.2.67 కోట్లు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ప్రసిద్ధ యాత్రాస్థలమైన మలెమహదేశ్వర బెట్ట ఆలయంలో జరిగిన హుండీ కానుకల లెక్కింపులో ఈసారి 34 రోజుల వ్యవధిలో భక్తుల నుంచి అత్యధికంగా రూ.2.67 కోట్లు సేకరణ అయ్యింది. కార్తీక మాసం, ఛట్టి అమావాస్య, ప్రభుత్వ సెలవు రోజులు, శబరిమలై, ఓం శక్తి యాత్రార్థులు, శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించారు, దీని వల్ల రూ.2,67,99,396 నగదు, 73 గ్రాముల బంగారు, కొంత వెండి సామగ్రి హుండీల్లో వేశారు. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 21 హుండీలో లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment