రూ. కోటి డిమాండు.. కాంట్రాక్టరు ఆత్మహత్య
బనశంకరి: రాష్ట్రంలో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆప్తుడైన రాజు కపనూరు పై ఆరోపణలు చేసిన యువ కాంట్రాక్టర్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ధూంధాంగా సమావేశాలు జరుపుకొనే వేళ, ఈ దారుణం వెలుగుచూడడం పార్టీకి ఇబ్బందిగా మారింది.
కోటి ఇవ్వకపోతే...
వివరాలు.. బీదర్ జిల్లా బాల్కి పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ సచిన్ (26). ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. అయితే మంత్రి ఖర్గే సన్నిహితుడైన రాజు కపనూరు ఆయనను డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ 7 పేజీల డెత్‌నోట్ రాసి గురువారం ఉదయం 7 గంటలప్పుడు బీదర్ వద్ద రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. డెత్ నోట్‌లో రాజు కపనూరు పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజు రూ. కోటి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు, డబ్బు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడని డెత్‌నోట్‌లో తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అందులో వివరించారు. బీదర్ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, మొబైల్‌ఫోన్, డెత్‌నోట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడే తెలిసింది: మంత్రి ఖర్గే
బెళగావిలో మంత్రి ప్రియాంక్‌ఖర్గే స్పందిస్తూ, బీదర్‌లో కాంట్రాక్టర్ సచిన్ ఆత్మహత్య గురించి ఇప్పుడే సమాచారం అందింది. ఎవరిపై ఆరోపణలు చేశారో అతను మా కార్యకర్త, కార్పొరేటర్‌గా ఉన్నారు. మరింత సమాచారం సేకరిస్తున్నాము. త్వరగా దర్యాప్తు చేపట్టాలి అని చెప్పారు.
బీదర్ వద్ద ఘోరం
మంత్రి ఖర్గే ఆప్తునిపై ఆరోపణలు
ఎవరీ రాజు కపనూరు?
రాజు కపనూరు మంత్రి ప్రియాంక ఖర్గే సన్నిహితునిగా పేరు పొందాడు. కలబురిగి కాంగ్రెస్ కార్పొరేటర్ అయిన అతడు గతంలో అక్రమంగా నాటు పిస్టల్ కలిగి ఉన్న కేసులో యడ్రామి పోలీసులు అరెస్ట్ చేశారు. గత సెప్టెంబరులో గురులింగప్ప అనే వ్యక్తి నుంచి రాజ కపనూరు రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, 30 బుల్లెట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. గురులింగప్పను అరెస్టు చేసినప్పుడు రాజు పేరు చెప్పాడు. విచారణకు పిలిచినా రాకపోవడంతో రాజును అరెస్ట్ చేశారు. తరువాత బెయిలుపై విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment