టూరిస్టుకూ తప్పని సైబర్ లూటీ
బనశంకరి: డిజిటల్ అరెస్ట్‌లు అనేవి ఉండవు, సైబర్ మోసగాళ్ల బెదిరింపులకు లొంగిపోవద్దు అని పోలీసులు ఎంత జాగృతం చేసినప్పటికీ ఆ నేరాలు తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒకరు వలలో పడి మోసపోతున్నారు. ఆఖరికి విదేశీ పర్యాటకులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. బెంగళూరులో ఉన్న జపాన్ పర్యాటకున్ని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.35 లక్షలు దోచేశారు. భారతదేశం, అందునా బెంగళూరును చూసి వద్దామనుకుంటే నిలువునా మోసపోయానని బాధితుడు దుఃఖించాడు. బాధితుడు ఆగ్నేయ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వరుసగా ఫోన్లు చేసి..
వివరాలు.. ఈ నెల 12వ తేదీన టెలిఫోన్ రెగ్యులేటరి అథారిటీ (ట్రాయ్) ప్రతినిధుల పేరుతో సైబర్ మోసగాళ్లు బాధిత టూరిస్టుకు కాల్ చేసి మీ నంబరును బ్లాక్ చేస్తామని చెప్పారు. తరువాత ముంబై పోలీస్ అధికారి ముసుగులో ఫోన్ చేసిన మరో వంచకుడు మీరు మనీ లాండరింగ్ కేసులో భాగస్వామిగా ఉన్నారని, దర్యాప్తు కోసం డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. మీ బ్యాంక్ అకౌంట్‌లను పరిశీలించాలి. విచారణ పూర్తయిన తరువాత మీ డబ్బును వెనక్కి చెల్లిస్తామని చెప్పారు. నిజమేననుకున్న బాధితుడు వారు చెప్పినట్టల్లా విన్నాడు. డిసెంబరు 12 నుంచి 14 మధ్య ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మొత్తం రూ.35.49 లక్షల నగదు వంచకులు బదిలీ చేయించుకున్నారు. విచారణ తరువాత తిరిగిఇస్తారు కదా? అని టూరిస్టు భావించాడు. కానీ ఎన్నిరోజులైనా డబ్బు రాకపోవడంతో మోసం గుర్తించిన పర్యాటకుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీబీఐ అధికారినని.. ఉపాధ్యాయునికి మస్కా
మైసూరు: సీబీఐ అధికారినని చెప్పిన వంచకుడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని నుంచి రూ.9 లక్షలను బదలాయించుకున్నాడు. వివరాలు.. సిద్ధార్థ నగర నివాసి అయిన ఓ ఉపాధ్యాయునికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి సీబీఐ అధికారినని చెప్పి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. మానవ అక్రమ రవాణాలో పాల్పంచుకున్నారు. మీపై న్యూఢిల్లీ సీబీఐ ఆఫీసులో ఫిర్యాదు నమోదైందని బెదిరించాడు. దీంతో భయపడిన ఉపాధ్యాయుడు వంచకుడు చెప్పినట్లుగా దశల వారీగా రూ.9 లక్షలను అతను చెప్పిన ఖాతాకు పంపించాడు. మరింత సొమ్ము జమ చేయాలని డిమాండ్ చేయడంతో ఇది నేరగాళ్ల పని అని తెలుసుకుని సైబర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరులో జపాన్ పర్యాటకుని డిజిటల్ అరెస్ట్
రూ.35 లక్షల వసూలు
Comments
Please login to add a commentAdd a comment