బస్సు చార్జీల పెంపుపై బీజేపీ నిరసన
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి బస్సు టికెట్ ధర 15 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. శుక్రవారం నగరంలో మెజిస్టిక్ కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, ఛలవాది నారాయణస్వామి, విధానపరిషత్ సభ్యుడు సీ.టీ.రవి నేతృత్వంలో బీజేపీ నాయకులు, పురుష ప్రయాణికులకు గులాబీ పుష్పం ఇచ్చి వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్ ముఖా చిత్రాలను ధరించి తమ ఉద్దేశాన్ని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ప్రభుత్వం బస్సు టికెట్ ధరను పెంచి పురుష ప్రయాణికులపై భారం వేసిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పొద్దు పుడితే ఏదో ఒకటి ధరను పెంచి కన్నడిగుల రక్తాన్ని పిండేస్తున్నారని విమర్శించారు.
పోలీసులపై రోషావేశం...!
ఆర్.అశోక్, బీజేపీ నాయకులు కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆర్.అశోక్ పోలీసులపై రోషావేశం వ్యక్తం చేశారు. తామేమి ఇక్కడ ధర్నా చేపట్టేందుకు రాలేదని, తాము నిల్చుకున్న స్థలానికి కూడా ట్యాక్స్ చెల్లించాలా అని పోలీసులను నిలదీశారు. తాము ప్రయాణికులకు గులాబీ పుష్పం ఇచ్చేందుకు వచ్చామని, తమను అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్‌కు పంపండని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలపై పెను భారం : కుమారస్వామి
శివాజీనగర: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు చార్జీలు 15 శాతం మేర పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలు పెంచడమే పనిగా పెట్టుకుందన్నారు. బస్సు చార్జీల పెంపుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment