మురికివాడల అభివృద్ధికి చర్యలు
● మున్సిపల్ చైర్మన్ ఎన్.రూపేష్‌కుమార్
హొసపేటె: నగరంలో మురికివాడలను అభివృద్ధి చేసి అక్కడి నివాసులకు త్వరితగతిని హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఎన్.రూపేష్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన అత్యవసర సాధారణ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నగరంలోని 35 వార్డుల్లో 60 మురికివాడలను ప్రకటించామన్నారు. ఇందులో 24 ప్రాంతాలను కొలగేరి బోర్డుకు అప్పగించామన్నారు. మురికివాడల్లో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు జిల్లా కలెక్టర్‌తో కలిసి చర్చించినట్లు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 9683 మందికి పట్టాలు పంపిణీ చేశారమని తెలిపారు. అందులో 100 ఆస్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదయ్యాయని, మిగిలిన వారి ఆస్తులను ఆరు నెలల్లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. కమిషనర్ సి.చంద్రప్ప మాట్లాడుతూ నగరపాలక సంస్థ పట్టణ మురికివాడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. నగరంలోని మురికివాడల్లో రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను కల్పించేందుకు సిటీ కౌన్సిలర్లు నడుంబిగించాలని తెలిపారు. నామినేటెడ్ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ ఇంకా కొందరికి పట్టాలు పంపిణీ చేయలేదని, వారరికి త్వరితగతిన అందించాలని కోరారు. అధికారి చంద్రప్ప, వివిధ వార్డుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment