అరుదైన నృత్య వేడుక
బొమ్మనహళ్లి: ఒకే వేదికపై వివిధ భారతీయ నృత్యాల ప్రదర్సన ఇవ్వడం అద్భుతమైన ప్రయోగమని కళాభూషిణి డాక్టర్ దర్శిని మంజునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరు బసవనగుడిలోని ఇన్సిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్‌లో నృత్య ప్రదర్శన జరిగింది. ఒడిస్సీ, కథక్, కూచిపూడి, భరతనాట్యం, యక్షగానం నృత్యాలను ఒకేసారి ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
బెంగళూరులో మంకీపాక్స్?
● చిక్కమగళూరులో ఇద్దరికి
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పలుచోట్ల కోతి జ్వరం కలకలం మొదలైంది. బెంగళూరులో ఒక వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించినట్టు తెలిసింది. దుబాయ్ నుంచి ఇటీవలే వచ్చిన 40 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ రోగ లక్షణాలు ఉండడంతో విక్టోరియా ఆస్పత్రిలో చేరాడు. లక్షణాలు మాత్రమే ఉన్నాయని, వ్యాధి నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఇది బెంగళూరులో నమోదయ్యే మొదటి కేసు కానుంది.
మరోవైపు చిక్కమగళూరులో కొత్తగా రెండు మంకీపాక్స్ కేసులు వచ్చాయి. కొప్ప, ఎన్‌ఆర్ పుర తాలూకాల్లో తలా ఒక కేసు నమోదయంది. దీంతో జిల్లాలో మొత్తం బాధితులు 4కు పెరిగారు. రోగులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో జ్వరం లక్షణాలతో వచ్చే వారికి తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయిస్తున్నారు.
కాంతార బృందానికి ఊరట
యశవంతపుర: అటవీశాఖ ప్రాంతంలో కాంతార–2 చిత్రం బృందానికి పెద్ద ఉపశమనం దొరికింది. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా యసలూరు పరిధిలో అడవిలో షూటింగ్ జరుగుతోంది. చెట్లను కొట్టివేసి, పెద్ద పెద్ద మంటలు వేశారని, పేలుళ్లు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో షూటింగ్‌ని నిలిపేశారు. స్థానిక అటవీ ఉన్నతాధికారులు మూడురోజుల కిందట షూటింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. కృత్రిమంగా చెట్లను తయారు చేసి షూటింగ్‌కు ఉపయోగించారని, ప్రకృతికి హాని చేయలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
కబ్జాల తొలగింపు
బనశంకరి: బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) సిబ్బంది నగరంలో పలుచోట్ల అనధికార నిర్మాణాలను తొలగించి రూ.120 కోట్ల విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర తాలూకా యశవంతపుర హోబళి, మాళగాలలో సర్వే నెంబరు 14లో 2 ఎకరాల 16 గుంటల ప్రదేశంలో అక్రమంగా నిర్మించిన 20 షెడ్లను, కాంక్రీటు నిర్మాణాలను గురువారం జేసీబీ యంత్రాలతో నేలమట్టం చేశారు. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాపిరెడ్డిపాళ్యలో ఆక్రమించి నిర్మించిన 48 ఇళ్లను తొలగించారు.
సీఎన్‌జీ బంకు గ్యాస్ లీక్
● ప్రజలకు అనారోగ్యం
యశవంతపుర: కొడగు జిల్లా కుశాలనగర తాలూకా కూడ్లూరు లేఔట్‌లో కొత్తగా నిర్మించిన సీఎన్‌జి బంక్ నుంచి గ్యాస్ లీకై ంది. గ్యాస్ లీక్‌తో మంగళవారం సాయంత్రం నుంచి స్థానికులకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అనేక మంది అవస్థలు పడ్డారు. గ్యాస్‌ని పీల్చడంతో పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. పెద్దలకూ ఇవే సమస్యలు రావడంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ అధ్యర్వంలో ప్రజలు గ్యాస్ బంక్ వద్ద గురువారం ధర్నా చేశారు. యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ లీకై తాము నానా కష్టాలు పడ్డామని ఆరోపించారు. ఇళ్ల మధ్యలో ఉన్న గ్యాస్ బంక్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కుశాలనగర తహశీల్దార్ కిరణ్ గౌరయ్య బంక్‌ని పరిశీలించారు. టెస్టింగ్ సమయంలో గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment