త్యాగశీలి సుదీప్
● ఉత్తమ నటుడు అవార్డు తిరస్కృతి
● వేరెవరికై నా ఇవ్వాలని సూచన
శివాజీనగర: అభినయ చక్రవర్తి కిచ్చ సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి పైల్వాన్ చిత్రంలో నటనకు గాను ఆయనకు ఉత్తమ నటుని అవార్డును బుధవారం ప్రకటించడం తెలిసిందే. ఎవరైనా ఎగిరి గంతేసి అవార్డు పట్ల హర్షం ప్రకటిస్తారు. తన శ్రమను గుర్తించారని, అవార్డు తీసుకోవడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేస్తారు. కానీ సుదీప్.. ఈ అవార్డు వద్దని ప్రకటించారు.
గౌరవమే... కానీ
ఈ మేరకు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ సభ్యులారా, అత్యుత్తమ నటుడు విభాగంలో అవార్డును ప్రకటించడం వాస్తవానికి ఒక భాగ్యం. ఈ గౌరవానికి ధన్యవాదాలు చెబుతున్నాను. అయితే అనేక ఏళ్ల నుంచి నేను అవార్డులను తీసుకోవడం నిలిపివేశాను. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకొన్నాను. దానిని కొనసాగిస్తాను. కళకు అంకితమైన అనేక మంది అర్హత కలిగిన కళాకారులు ఉన్నారు. వారిలో ఒకరికి ఈ పురస్కారాన్ని ఇస్తే నాకు ఆనందం కలిగిస్తుంది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో నటున్ని ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అవార్డును త్యాగం మామూలు విషయం కాదని సుదీప్‌ను నెటిజన్లు ప్రశంసించారు.
శివయోగి జయంతి వేడుక
చిక్కబళ్లాపురం: ప్రతి ఒక్కరు శివయోగి సిద్దరామేశ్వర ఆదర్శాలను పాటించాలని జిల్లా కలెక్టర్ పిఎన్ రవీంద్ర అన్నారు. జిల్లా పాలకమండలి ఆధ్వర్యంలో గురువారం శివయోగి జయంతిని నగరంలోని ఒక్కలిగ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజ సంస్కరణలో ప్రముఖ పాత్ర పోషించినవారు వచనకారులు సిద్దరామేశ్వర అన్నారు. సిద్దరామేశ్వర చిత్రపటాన్ని పల్లకీలో అలంకరించి పట్టణ వీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. చదువులో ప్రతిభ చూపిన పిల్లలను సత్కరించారు. నగరసభ అధ్యక్షుడు గజేంద్ర, ఉపాధ్యక్షుడు నాగరాజు, అధికారులు అనిల్, రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment