అప్పు పేరిట అరాచకం
శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, బెంగళూరు: కన్నడనాట మైక్రో ఫైనాన్స్ వేధింపులు అధికమయ్యాయి. ఎలాంటి హామీ లేకుండా పిలిచి రుణాలు ఇచ్చి ఆ తర్వాత అక్రమ వడ్డీలతో కూలీ కార్మికులు, పేదవారి వెన్ను విరుస్తున్నాయి కొన్ని ఫైనాన్స్ కంపెనీలు. ఈ దౌర్జన్యం, దోపిడీలు, వేధింపులు తాళలేక ప్రస్తుతం ఎంతో మంది తమ ఉసురు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఊర్లను వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ మైక్రో ఫైనాన్స్ దారుణాలు రాష్ట్ర స్థాయిలో భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా మైక్రోఫైనాన్స్ కంపెనీల డాక్యుమెంట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ప్రభుత్వం సూచనలు చేసింది.
ఏ అనుమతులు ఉండవు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండా రాష్ట్రంలో పల్లెల్లో అక్రమ వడ్డీ దందాను ఈ ఫైనాన్స్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. పేదవారు, కూలీకార్మికులకు నగదు రూపంలో రుణాలు ఇచ్చి వారం, నెల లెక్క కింద వడ్డీని వసూలు చేస్తున్నాయి. అప్పు వస్తోంది కదా అని ఆలోచన కూడా చేయకుండా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత సదరు కంపెనీలు విధించే వడ్డీలు చూసి లబోదిబోమంటున్నారు. వడ్డీలు సైతం చెల్లించలేక కుంగిపోతున్నారు.
వడ్డీ దందా ఎలా?
● రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇస్తారు
● 20–25 శాతం వడ్డీలు ఉంటాయి. వారం, నెలవారీ రూపంలో వసూలు చేస్తారు.
● ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని ఎలాంటి జామీను లేకుండా రుణాల మంజూరు
● వడ్డీ చెల్లించడంలో ఒక రోజు ఆలస్యం అయినా అంగీకరించని కంపెనీలు
● డబ్బులు చెల్లించని వారి ఇంటి ముందు బోర్డులు ప్రత్యక్షం
● ఫోన్లలో అసభ్య పదజాలంతో ఒత్తిడులు
● వేధింపులను తట్టుకోలేక ఇళ్లు గ్రామాలు ఖాళీ చేస్తున్న కుటుంబాలు
విపరీతమైన భారం
కొన్ని గ్రామాల్లో ఇంటి రుణం పేరిట రుణాలు ఇచ్చి ఆ తర్వాత వేధింపులు చేస్తున్నారు. రూ. 10 లక్షల అప్పు ఇస్తే ప్రారంభంలో రూ. 2.50 లక్షలు పట్టుకుని రూ. 7.50 లక్షలే ఇస్తున్నారు. రుణగ్రహీత కంతుల రూపంలో రూ. 10 లక్షలను కట్టాల్సిందే. ఒక్క కంతు ఆలస్యమైనా సతాయింపులు మొదలవుతాయి. రాష్ట్రంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థల దుర్వినియోగం, మీటర్ వడ్డీ మాఫియాను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని చేయనున్నట్లు న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేస్తామని చెప్పారు.
అంతులేని ఆగడాలు
చెన్నపట్టణ తాలూకా మైలనాయ్కనహళ్లి గ్రామంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులకు విసిగిపోయి 50 ఏళ్ల లీలావతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
రామనగర తాలూకా తిమ్మయ్యదొడ్డి గ్రామానికి చెందిన యశోదమ్మ మైక్రో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణం
కొడగు జిల్లా కుశాలనగర తాలూకా మీనుకొల్లిహాడిలో మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులు తాళలేక 50 కుటుంబాలు రాష్ట్రం నుంచే పలాయనం అయినట్లు తెలిసింది.
హావేరి జిల్లా రాణిబెణ్ణూరు తాలూకా గుడ్డదబేవినహళ్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ జీవన నిర్వహణ కోసం మైక్రో ఫైనాన్స్‌లో రుణాలు తీసుకుని, వాటిని తీర్చడం సాధ్యపడలేదు. సిబ్బంది వేధింపులను భరించలేక యువకులు గ్రామాన్ని విడిచి పారిపోతున్నారు. ఈ ఊరిలో వయోవృద్ధులు, చిన్నపిల్లలు తప్ప వేరే ఎవరూ కనిపించడం లేదు..
బెళగావి జిల్లా కాకతి తాలూకా శిరూర గ్రామంలో ఫైనాన్స్ కంపెనీ సతాయింపులను తట్టుకోలేక కిరబి అనే మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా తరచూ విషాద ఘటనలు.
రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ల వేధింపులు
విపరీతమైన వడ్డీ భారం
చెలరేగిపోతున్న రుణ సంస్థలు
తట్టుకోలేక బాధితుల ఆత్మహత్యలు
డబ్బు అవసరం ఎవరికి ఉండదు? కూలీ నుంచి కుబేరుని వరకు పైసా కావాల్సిందే. కొందరు పేదలు అవసరాల కోసం అప్పులు చేస్తారు. అదే ఉరితాడు అవుతోంది. రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా మైక్రో ఫైనాన్స్ సంస్థల అరాచకాలే వినిపిస్తున్నాయి. తక్షణం కట్టడి చేయకుంటే ప్రజలకు ఇబ్బందే.
Comments
Please login to add a commentAdd a comment