కరుణించు దుర్గమ్మా
మాలూరు: రథసప్తమి సందర్భంగా తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ దుర్గాదేవి దేవాలయంలో దుర్గా మాతకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవి మూలవిరాట్టును, అలాగే ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి పూజలు చేశారు. మహామంగళారతి తరువాత దర్శన భాగ్యం కల్పించారు.
చెరువులోకి కారు పల్టీ,
మెడికోలకు గాయాలు
యశవంతపుర: కారు ముందు చక్రం పంచర్ కావడంతో అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదు మంది చైన్నె వైద్య విద్యార్థులు గాయపడి చన్నరాయపట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం కారు చెరువు కట్టపై వేగంగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చెరువులో కొంచెమే నీరు ఉండగా, కారులో నీటిలో సగం మునిగిపోయింది. స్థానికులు గుర్తించి కారు తలుపులను పగలగొట్టి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. వారికి చిన్న చిన్న గాయాలై ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
అనుమానంతో.. వెంటాడి హత్య
● హెబ్బగోడిలో భర్త దురాగతం
దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చాడో కిరాతక భర్త. ఈ సంఘటన బెంగళూరు ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయకనగరలో చోటుచేసుకుంది. శ్రీగంగ (27), భర్త మోహన్‌రాజు(30). వీరు చిరుద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్‌లో పనిచేసేది. పృథ్విక్ (6) అనే కుమారుడు ఉన్నాడు. శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్‌రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతున్నాడు. దీంతో నిత్యం ఇద్దరికీ గొడవ జరిగేది. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తనపై మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరూ గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి ఎనిమిది సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్‌రాజుని అరెస్టు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, అతడు అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. అలా వచ్చినప్పుడు గొడవపడి హత్య చేశాడని తెలిపారు.
వడ్డీ వ్యాపారుల అరెస్టు
యశవంతపుర: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపుల నేపథ్యంలో పోలీసులు దాడులు చేపట్టారు. అధిక వడ్డీలను వసూలు చేస్తున్న ఐదు మందిని ఉత్తరకన్నడ జిల్లా ముండగోడలో అరెస్ట్ చేశారు. వీరు మీటర్ వడ్డీ రూపంలో విపరీతంగా వడ్డీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. రూ.10 లక్షలు అప్పు ఇస్తే అందులో రూ.3 లక్షలను వడ్డీ కింద ముందే కట్ చేసుకుంటారు. రుణగ్రహీతకు ఇచ్చేది రూ. 7 లక్షలు మాత్రమే. ఎన్‌ఎండి జమీర్ అనే వడ్డీ వ్యాపారి ఎక్కువగా ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసి అరెస్టు చేశారు. మొత్తం 21 మంది ఇళ్లలో సోదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment