రైతన్న కష్టం బూడిద
మండ్య: రైతు కుటుంబం ఎన్నో నెలలు కష్టపడి పండించిన పంట అగ్ని అర్పణం అయ్యింది. వరిధాన్యం కుప్పకు నిప్పంటుకోవడంతో లక్షలాది రూపాయల విలువ చేసే వడ్లు, గడ్డి కాలిబూడిదైన ఘటన తాలూకాలోని హెచ్.కోడిహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన డైరీ రాజు.. రెండు ఎకరాల పొలంలో పండించిన సుమారు 30 క్వింటాళ్ల వరిధాన్యం పంటను కోసి ఇంటి సమీపంలో కుప్పవేశారు. బుధవారం ఎలా జరిగిందో కానీ ఆ కుప్ప మంటల్లో చిక్కుకుంది. ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. కానీ పంట కాలిపోవడంతో రైతు భారీగా నష్టపోయాడు. గ్రామ పీడీఓ సయ్యద్ సందర్శించి పరిశీలించి జరిగిన నష్టంపై తహసీల్దార్‌కు నివేదిస్తానన్నారు.
ఏటీఎంలో సైరన్..
దొంగలు పరార్
కృష్ణరాజపురం: బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకాలోని కోలారు వెళ్లే జాతీయ రహదారిలో తావరకెరె కెనరా బ్యాంకు ముందున్న ఏటీఎంలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు నల్ల దుస్తులు, హెల్మెట్, రాడ్లు పట్టుకుని చొరబడ్డారు. ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. యంత్రం ఓపెన్ కాగానే సైరన్ మోగింది. దీంతో భయపడి అక్కడి నుంచి ఇద్దరు దొంగలు పరుగు తీశారు. కొంతసేపటికి నందగుడి పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా దొంగలు వెళ్తూ వెళ్తూ ఏటీఎం పక్కన ఉన్న ఓ మొబైల్ షాపులో రూ.లక్షకు పైగా విలువ చేసే 20కి పైగా మొబైల్ ఫోన్లను, రూ.8 వేల నగదును దోచుకున్నారు.
కాలువలో ఖాళీ ఏటీఎం
యశవంతపుర: హాసన్ సమీపంలోని శంకరనహళ్లి గ్రామం వద్ద కాలువలో ఏటీఎం పడి ఉంది. అందులోని డబ్బులు తీసుకొని ఏటీఎంను పడేసి వెళ్లారు. జనవరి 29న హనుమంతపుర ఇండియా ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలో శంకరనహళ్లి సమీపంలోని నీటి కాలువలో ఖాళీ ఏటీఎం దర్శనమిచ్చింది. పోలీసులు బయటకు తీసి తనిఖీ చేయగా రూపాయి కూడా కనబడలేదు. యంత్రంలో ఎంత డబ్బులున్నదీ తెలియడం లేదు.
ఉద్యోగికి రూ.9 లక్షల టోపీ
మైసూరు: అధిక లాభాలు ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని మోసగాళ్లు రూ. 9.38 లక్షలను పెట్టుబడులు పెట్టించి ముంచేశారు. మైసూరు రాఘవేంద్ర నగర నివాసి అయిన ఒక వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగి. షేర్ల ట్రేడింగ్ గురించి వాట్సాప్‌కు ఒక సందేశం వచ్చింది. అదేసమయంలో మోసగాళ్లు ఆయనను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. తొలుత తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడులు పెట్టాడు. ఆ తర్వాత కొద్దిగా లాభాలువచ్చాయి. దశల వారీగా వంచకులు రూ. 9.38 లక్షలను బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. తరువాత దుండగులు ఫోన్‌ని బ్లాక్ చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు.
మంటల్లో చార్మాడి ఘాట్
● వందల ఎకరాల అడవి బుగ్గి
యశవంతపుర: చిక్కమగళూరు– దక్షిణ కన్నడను కలిపే చార్మాడి ఘాట్ మార్గంలో మళ్లీ మంటలు వ్యాపించాయి. అణ్ణప్పస్వామి ఆలయం చుట్టుపక్కల అడవిలో కార్చిచ్చు మొదలైంది. గాలి వేగంగా ఉన్నందున మంటలు విస్తరిస్తున్నాయి. ఎవరో ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. గత వారంలోను మూడిగెరె తాలూకా చార్మాడి ఘాట్ బిదిరుతళ అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి పెద్ద విస్తీర్ణంలో అడవి బూడిదైంది. తాజా అగ్ని ప్రమాదంలో ఐదు వందల ఎకరాల వరకు అటవీ ప్రాంతం కాలిపోయింది. స్థానికులు ఆందోళనలో ఉన్నారు. అడవిలో 10 కిలోమీటర్లు దూరం వరకూ అగ్నికీలలు కనిపిస్తున్నాయి. వన్యజీవులు, వన సంపద అపారంగా బుగ్గయింది. ఫైర్, అటవీ సిబ్బంది రోడ్డుకు అటు ఇటు ఉన్న మంటలను అదుపు చేస్తున్నారు. కానీ ఎత్తైన ప్రాంతాలలో ఆర్పే వెసులుబాటు లేదు. దీంతో పగలు, రాత్రి నిరంతరాయంగా మంటలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment