కలుషిత నీటి కాటు
● 30 మందికి అస్వస్థత
శివాజీనగర: రాజధానిలో అప్పుడే తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. నీటి కొరత, కలుషిత నీటితో ఇబ్బందులు తలెత్తాయి. మలినమైన తాగునీటిని వాడడం వల్ల పలువురు అనారోగ్యానికి గురైన సంఘటన పులకేశినగరలో చోటు చేసుకొన్నది. స్థానిక ప్రోమనేడ్ రోడ్డు, అస్సాయ రోడ్డులో బాధితులు అతిసారం, వాంతులతో అస్వస్థత చెందారు. అనేక ఇళ్లలోనివారు అనారోగ్యానికి గురి కావడంతో 30 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లారు. పాలికె, వైద్య సిబ్బంది ఇక్కడి నీటి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా ప్రమాదకరమైన ఈ.కొలి, క్లిబ్సిల్లాన్యుమోనియా వంటి బ్యాక్టీరియాలు ఉన్నట్లు బయటపడింది. జలమండలి ద్వారా సరఫరా అవుతున్న నీటినే తాగుతున్నట్లు జనం చెప్పారు. ఆ నీరు తాగేందుకు ఎంతమాత్రం అనుకూలంగా లేదని కొన్నిరోజుల క్రితమే ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఆరోపించారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రి పాలయ్యామని చెప్పారు. జలమండలి నిర్లక్ష్య ధోరణితో విసుగెత్తిన ప్రజలు మంగళవారం బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో తాగునీటిలోకి కలుషితాలు ఎలా చేరుతున్నాయో కనిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బాధిత ప్రాంతాలలో ప్రత్యేకంగా తాగునీటిని అందిస్తున్నారు. బాధితులు కోలుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment