![చిచ్చు రగిల్చిన పోస్టు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11bng13-120024_mr-1739300647-0.jpg.webp?itok=yKPaTGAU)
చిచ్చు రగిల్చిన పోస్టు
మైసూరు: రాచనగరిలో ఓ సోషల్ మీడియా పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఓ వ్యక్తి తమ మతం గురించి కించపరిచేలా పోస్టు పెట్టాడని సోమవారం రాత్రి ఒక మతానికి చెందిన వందలాది మంది ప్రజలు ఆగ్రహంతో మైసూరులోని ఉదయగిరి ఠాణా ముందు ధర్నాకు దిగారు. ఆపై ఠాణా మీదకు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. 7 మంది పోలీసులు గాయపడ్డారు.
ఏం జరిగిందంటే
వివరాలు... ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, యూపీ నేత అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్‌ల కార్టూన్లను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనికి బదులుగా కళ్యాణగిరి లేఔట్‌కు చెందిన యువకుడు మరో పోస్టు పెట్టాడు. ఆ పోస్టు తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ వందలాది మంది ప్రజలు ఆగ్రహంతో ముట్టడించారు. కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొట్టి మరీ నిరసనకు తరలించారు. పోస్టు పెట్టిన యువకున్ని తమకు అప్పగించాలని కేకలు వేశారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరగా ఒప్పులేదు. దీంతో పోలీసులతో గొడవ మొదలైంది. కొందరు స్థానిక నాయకులు వచ్చి ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరినా ఒప్పుకోలేదు. నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. ఇంతలో కొందరు రాళ్ల వర్షం కురిపించారు. ఠాణా కిటికీల అద్దాలు, వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఏడుమంది పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. దీంతో వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేయగా, తలోదిక్కుకు పరుగులు తీశారు. కొంత మంది పోలీసులపైకి రావడంతో భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసు ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
యువకుడు అరెస్టు
పోలీసు అధికారులు మాట్లాడుతూ పోస్టు పెట్టిన యువకున్ని అరెస్టు చేశామని, అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. రణరంగంగా మారడంతో ఉదయగిరిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం వరకు ఎవరూ బయటకు రాలేదు. బందోబస్తు కొనసాగుతోంది. మరోవైపు ఠాణాపై దాడిచేసిన వారిని గుర్తించి అరెస్టుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మైసూరు అంతటా ఉద్రిక్తత వ్యాపించడం గమనార్హం.
మైసూరులో ఓ వర్గం ప్రజల ధర్నా
పోలీసు స్టేషన్‌పై రాళ్ల దాడి
పోలీసుల లాఠీచార్జీ,
భాష్పవాయు ప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment