![సైబర్ నేరమా.. కాల్ 1930](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11bng25-120041_mr-1739300647-0.jpg.webp?itok=aEa_KvzZ)
సైబర్ నేరమా.. కాల్ 1930
యశవంతపుర: బెళగావిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేరాల కట్టడికి ప్రజలలో జాగృతిని కల్పించేందుకు 1930 సహాయవాణిని మంగళవారం నగర పోలీసు కమిషనర్ యడా మార్టిన్ మార్బన్యాంగ్ ప్రారంభించారు. కిత్తూరు చెన్నమ్మ విగ్రహం చుట్టు పక్కల పెద్ద ఫైక్సీలను ఏర్పాటు చేశారు. మీరు సైబర్ నేరాలకు గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఫ్లెక్సీలలో ఉంది. ఇప్పుడు అందరూ మొబైల్‌ఫోన్ వాడుతున్నారు, ప్రజలలో జాగృతి లేకపోవడం వల్ల సైబర్ నేరాలు జరుగుతున్నట్లు యడా మార్టిన్ తెలిపారు. బెళగావిలో 70 ఫ్లెక్సీలను కట్టినట్లు తెలిపారు. 2024లో బెళగావి పరిధిలో 4 డిజిటల్ అరెస్ట్‌లు జరగ్గా, ఆ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఫోన్‌లో కాల్ డేటా..
ఐశ్వర్యకు నోటీసులు
యశవంతపుర: అక్రమంగా కొందరు వ్యక్తుల ఫోన్ కాల్ డేటా (సిడిఆర్)ను సేకరించుకోవడంపై చీటింగ్ కేసుల్లో నిందితురాలు ఐశ్యర్వగౌడకు నగర పోలీసులు నోటీసును జారీ చేశారు. విజయనగర ఏసీపీ చందన్ ఈ నోటీసులిచ్చారు. మాజీ ఎంపీ డీకే సురేశ్ సోదరినంటూ నగల షాపు నుంచి కోట్ల రూపాయల నగలను కాజేయడం, ఇతరత్రా మోసాల్లో ఆమె ఉన్నందున పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఐదు పోన్లు, భర్తకు చెందిన రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తనిఖీ చేయగా పలువురి కాల్ డేటా సమాచారం లభించింది. ఫిర్యాదిదారు భరత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్యాటరాయనపుర పోలీసులు ఈ అంశంపై కేసు నమోదు చేశారు.
సంజన డ్రగ్స్ కేసుపై
సుప్రీంకు పోలీసులు!
దొడ్డబళ్లాపురం: నటి సంజనా గల్రాని మరోసారి డ్రగ్స్ కేసులో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమైపె ఉన్న డ్రగ్స్ కేసును హైకోర్టులో సవాల్ చేసి సాక్ష్యాలు లేవని రద్దు చేయించుకోవడం తెలిసిందే. ఇప్పుడు పోలీసులు కేసు రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టుకు అప్పీలు చేయనున్నారు. హోంశాఖ నుంచి అనుమతి రాగానే సుప్రీం కోర్టులో అప్పీలు వేస్తామని పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు.
ఢిల్లీకి మంత్రుల క్యూ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సీఎం మార్పు, కేపీసీసీకి నూతన సారథి గురించి వేడిగా చర్చలు జరుగుతున్న సమయంలో మంత్రి సతీష్ జార్కిహొళి ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గె, వేణుగోపాల్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వీటిలో ఏదో ఒక పదవి నాకు ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం. అలాగే చిత్రదుర్గలో ఎస్‌సీ ఎస్టీ నేతల సమావేశం జరపడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు హోంమంత్రి పరమేశ్వర్, మంత్రులు రాజణ్ణ, మహదేవప్పలు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment