పలువురు విదేశీయుల నిర్బంధం
యశవంతపుర: నగర సీసీబీ పోలీసుల హెణ్ణూరు ఠాణా పరిధిలోని విదేశీ పౌరున్ని అరెస్ట్ చేసి రూ.8 లక్షల విలువగల 55 గ్రాముల ఎండిఎంఎ, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై గతేడాది బైయప్పనహళ్లి ఠాణాలో డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదై ఉంది. మళ్లీ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. చిక్కజాల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ మహిళతో పాటు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేసి విదేశీయుల ఆశ్రయ కేంద్రానికి తరలించారు. విద్యారణ్యపుర, అమృతహళ్లి పరిధిలో ఇద్దరు విదేశీ పౌరుల్ని కూడా అరెస్ట్ చేసి అక్కడికి పంపించారు. పుట్టేనహళ్లి, గోవిందపుర పరిధిలో డ్రగ్స్ కేసుల్లో పరారీలో ఉన్న ఇద్దరు విదేశీ పౌరుల్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
వడ్డీ వ్యాపారులపై
పోలీసుల దాడులు
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోందని సమాచారం రావడంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నగరంలో 9 చోట్ల వడ్డీ వ్యాపారుల ఇళ్లకి వెళ్లారు. రూ. 39 లక్షల నగదు, 24 మొబల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 72 చెక్‌లు, 19 ఆర్‌సీ బుక్కులు, సేల్ డీడ్‌లు, అప్పులిచ్చి కుదువ పెట్టుకున్న 29 బైకులు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ప్రాంసరీ నోట్లు కూడా లభించాయి. ఆ వ్యాపారులపై కేసులను కూడా నమోదు చేశారు. దొడ్డపేటె ఠాణా పరిధిలో ఉన్న అన్నానగర్, మర్నామి బైలు, కామాక్షి వీధి, అలాగే కోటె ఠాణా, కాశీపుర, జయనగర ఠాణాల పరిధిలోని ప్రాంతాల్లో తనిఖీలు సాగయి.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మైసూరు: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అప్పుల బాధతో రైతులు చనిపోతున్నారు. జిల్లాలోని సాలిగ్రామ తాలూకాలోని కర్తాలు గ్రామంలో కేఎస్ యోగేశ్ (55) అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అరకళగూడు తాలూకాలోని మధురనహళ్ళి సహకార సంఘంలో రూ. 2 లక్షలు, బయట రూ. 5 లక్షల వరకూ అప్పులు చేశాడు. పంటలకు తెగుళ్లు వచ్చి నష్టం వచ్చింది. ఈ ఇబ్బందులను భరించలేక పొలంలో చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
షేర్ల ట్రేడింగ్ అని రూ.64 లక్షలు టోకరా
మైసూరు: వారసత్వ నగరి సైబర్ మోసగాళ్ల బాధితులకు నిలయంగా మారింది. తరచూ ఎవరో ఒక అభాగ్యుడు వంచకులకు చిక్కుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి ఆన్‌లైన్లో రూ. 64.80 లక్షలను పెట్టుబడిగా పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడో నగరవాసి. ఎన్‌ఆర్ మొహల్లాకు చెందిన వ్యాపారి మొబైల్‌కి ఆన్‌లైన్ షేర్ల వ్యాపారం గురించి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దానిని చూసిన అతడు లింక్ నొక్కడంతో ఓ గ్రూపులో యాడ్ అయ్యాడు. అందులో షేర్ల ట్రేడింగ్ వల్ల చాలా లాభాలు వచ్చాయని మెసేజ్‌లు పెట్టేవారు. అది నమ్మి బాధితుడు 64.80 లక్షలను మోసగాళ్ల ఖాతాలకు పంపాడు. పెద్దమొత్తంలో లాభం వస్తోందని తప్పుడు సమాచారం అతనికి పంపించేవారు. డబ్బు తిరిగివ్వాలని కోరగా ఎలాంటి స్పందన లేదు. బాధితుడు మైసూరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆర్టీసీ బస్ పల్టీ,
17 మందికి గాయాలు
యశవంతపుర: డ్రైవర్ వేగంగా నడపడంతో అదుపుతప్పి కేఎస్ ఆర్టీసీ బస్ పల్టీ పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా యల్లాపుర తాలూకా కణ్ణిగేరి వద్ద జరిగింది. ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శిరసి నుంచి బెళగావికి వెళుతున్న బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ఆపై బోల్తా పడింది. గాయాలైన ప్రయాణికులను యల్లాపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుబ్లీ కిమ్స్‌కి తీసుకెళ్లారు. యల్లాపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
పలువురు విదేశీయుల నిర్బంధం
Comments
Please login to add a commentAdd a comment