సాక్షి, బెంగళూరు: ఇన్వెస్ట్ కర్ణాటక– 2025 పెట్టుబడిదారుల సదస్సు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంగళవారం నుంచి ఆరంభమైంది. 5 వేల మందికి పైగా ప్రతినిధులు, 16 దేశాల రాయబారులు పాల్గొన్నారు. తొలిరోజు రూ. 3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కర్ణాటక రాష్ట్రంలో పెట్టేందుకు ఒప్పందాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. టీవీఎస్ కంపెనీ రూ. 2 వేల కోట్లను రానున్న ఐదేళ్లలో పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చింది. జేఎస్‌డబ్ల్యూ, మహీంద్రా అండ్ మహీంద్రా, యూరోప్ ఫ్యూచర్ తదితర అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచాయి. ఈ సదస్సు ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యువత పారిశ్రామికవేత్తల కోసం ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరిట ఎక్స్‌పోను బుధవారం ప్రారంభించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భారీ పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ పాల్గొన్నారు. పలు స్టాళ్లను సందర్శించారు.
మార్చి 1 నుంచి సినీ ఉత్సవ్
సాక్షి బెంగళూరు: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 1న విధానసౌధ ఆవరణలో సీఎం సిద్ధరామయ్య ఈ చలనచిత్రోత్సవాన్ని ప్రారంభిస్తారని వార్తా, సమాచార శాఖ కార్యదర్శి కావేరి తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి 200 అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ‘సర్వ జనాంగద శాంతియ తోట’ అనే థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు రాజాజీనగర ఒరాయన్ మాల్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో ఉన్న 11 స్క్రీన్స్‌లో మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన ఉంటుందన్నారు. మార్చి 8న జరిగే ముగింపు సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పాల్గొంటారని తెలిపారు.
తంబాకు వ్యసనం..
యువతి బలవన్మరణం
హుబ్లీ: దుర్వ్యసనాలు మానుకో, నీది ఇంకా చిన్నవయస్సు, తంబాకు తినవద్దు అని బుద్ది చెప్పినందుకు ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హావేరి జిల్లాలోని అదే తాలూకా కర్జగి గ్రామంలోని రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. మృతురాలు బేబిజాన్ సొండి (18). ఆమె కొన్నిరోజులుగా పొగాకు నమలడానికి అలవాటు పడింది. ఇది మంచిది కాదు, మానుకో అని ఆమెను తల్లిదండ్రులు మందలించారు. ఇంటి పని చేసే బేబిజాన్.. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నా డబ్బులతో తంబాకు తింటున్నా, మీకేం ఇబ్బంది అని గొడవపడేది. చిన్న వయస్సులో ఈ దురలవాటు తగదమ్మా అని కన్నవారు గట్టిగా హెచ్చరించడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. హావేరి రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
మహిళ ఉసురు తీసిన ఫైనాన్స్
బనశంకరి: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు సామాన్యుల ఊపిరి తీస్తున్నాయి. కొడగులో జిల్లా ఘటన సోమవారపేటే తాలూకా శనివారసంత గ్రామంలో ఓ మహిళ ఇలాగే ఆత్మహత్య చేసుకుంది. హసీనా అనే మహిళ కొన్ని రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదాల చెల్లింపు ఆలస్యమవుతోంది. సిబ్బంది రుణం చెల్లించాలని హసీనాకు ఫోన్ చేసి బెదిరించసాగారు. ఇది తట్టుకోలేక ఆమె బుధవారం ఇంటిలో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఫైనాన్స్ సిబ్బందే కారణమని హసీనా కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మైక్రో ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఓకే
బనశంకరి: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీల దూకుడుకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాజ్‌భవన్ ఆమోదం తెలిపింది. బుధవారం గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సంతకం చేశారు. వారం కిందట సిద్దరామయ్య సర్కారు ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌కు పంపింది. బిల్లులోని పలు అంశాల మీద సందేహాలను వెలిబుచ్చుతూ ఆయన తిరస్కరించారు. దీంతో సర్కారు అదనపు సమాచారాన్ని జతచేసి సోమవారం మళ్లీ గవర్నర్‌కు పంపించింది. ఎట్టకేలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టమై అమలులోకి వచ్చినట్లే.
Comments
Please login to add a commentAdd a comment