కూతురిని హత్య చేసిన తండ్రి
ఆనేకల్ తాలూకాలో ఘోరం
బనశంకరి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. కూతురిని చెరువులోకి తోసి హత్య చేశాడో క్రూర తండ్రి. వివరాలు.. హుస్కూరు గ్రామంలోని సహన (19) మృతురాలు. సహన, నితిన్ గత ఏడాది నుంచి ప్రేమించుకున్నారు. రెండురోజుల క్రితం యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది.
పంచాయతీలో రగడ
సహన తండ్రి రామమూర్తి, నితిన్ కు ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించాడు. అతడు తల్లితో కలిసి పంచాయతీకి వెళ్లాడు. నా కూతురి జోలికి రావద్దని రామమూర్తి గట్టిగా హెచ్చరించాడు. ఇందుకు కూతురు సమ్మతించలేదు. దీంతో రామమూర్తి కుమార్తె సహనపై దాడికి పాల్పడ్డాడు. పంచాయతీ ముగిసిన తరువాత ఇంటికి వెళ్తూ దారిలోని చెరువులోకి కూతురిని తోసివేశాడు. దీంతో ఆమె నీట మునిగి చనిపోయింది. తండ్రే ఆమెను హత్య చేశాడని ప్రియుడు ఆరోపించాడు. హెబ్బగోడి పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
20వ అంతస్తు నుంచి దూకి బాలిక ఆత్మహత్య
కృష్ణరాజపురం: పిల్లల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్షలకు నెల రోజులు కూడా లేదు. బాగా చదువు, మంచి మార్కులతో పాస్ కావాలి అని తల్లిదండ్రుల ఒత్తిడి. ఇది భరించలేక లేత మనసులు భయాందోళనకు గురవుతుంటాయి. పరీక్షలు వస్తున్నాయి, మొబైల్ పక్కన పడేసి చదువుకో అంటూ తల్లి తిట్టిందని బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు కాడుగోడిలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థిని అవంతిక చౌరాసియా (15) కాడుగోడిలోని అసెట్స్ మార్క్ అపార్టుమెంట్ 20వ అంతస్తు నుంచి దూకింది, తీవ్ర గాయాలతో అక్కడే మరణించింది. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బాగా చదవాలని కోపడినందుకు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని బాలిక తల్లి చెప్పినట్లు డీసీపీ శివకుమార్ తెలిపారు.
ఆహారం కలుషితం.. బాలలకు అస్వస్థత
తుమకూరు: ఉపాహారం తిన్న సుమారు 20 మందికి పైగా హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తాలూకాలోని లక్కనహళ్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సర్కారీ హాస్టల్‌లో మంగళవారం రాత్రి కోడి కూర, బుధవారం ఉదయం ఇడ్లీ టిఫిన్‌ను తిన్నారు. కొంతసేపటికి విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే వారిని శిరా తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శిర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యుల తెలిపారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడమే అస్వస్థతకు కారణమని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment