కంటితుడుపుగా మెట్రో ధర తగ్గింపు
శివాజీనగర: ప్రయాణ ధరను పెంచి ఆగ్రహానికి గురైన బెంగళూరు మెట్రో రైల్వే బోర్డు(బీఎంఆర్‌సీఎల్) మెట్రో ప్రయాణ ధరను స్వల్పంగా తగ్గించి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. చార్జి ధర 80 శాతం నుంచి 100 శాతం పెరిగిన చోట్ల ప్రయాణికులకు కంటితుడుపుగా కేవలం రూ.10 తగ్గించింది. మీడియాలో 50 శాతం పెంపు అని ప్రకటన చేసి 100 శాతం ధరను పెంచిన బీఎంఆర్‌సీఎల్... ప్రస్తుతం ధరలో 30 శాతం తగ్గించింది. అయితే కనీస రూ.10, గరిష్ఠ రూ.90 ధరలో ఎలాంటి మార్పు కాలేదు. ముందుగా యశ్వంతపుర మెట్రో నుంచి మెజిస్టిక్‌కు రూ.25 ధర ఉండేది. సవరించిన తరువాత ధర రూ.50కు పెరిగింది. ప్రస్తుతం పునః సవరణ తరువాత రూ.40లకు తగ్గింది. సవరణ కాకముందు ఉన్న ధరతో పోలిస్తే సుమారు 60 శాతం పెరిగింది. స్టేజ్, కొన్ని సా్‌ల్బ్‌లలో కొన్ని తప్పులు దొర్లగా సరి చేసి నేటి నుంచి ధరను సవరించామని, మళ్లీ టికెట్ ధర తగ్గించబోమని బీఎంఆర్‌సీఎల్ ఉన్నత వర్గాలు తెలిపాయి.
ధర ఎంత తగ్గింపు?
రాజాజీనగర లాల్‌బాగ్‌కు గతంలో ధర రూ.50, ప్రస్తుత ధర రూ.40 గా సవరించారు. పీణ్య–సెంట్రల్ కాలేజ్ మధ్య గతంలో ధర రూ.60, ప్రస్తుత ధర రూ.50కి చేరింది. గరుడాచార్ పాళ్య–ఎంజీ రోడ్డు మధ్య గతంలో ధర రూ.60, ప్రస్తుత ధర రూ.50, మైసూరు రోడ్డు–ఇందిరానగర మధ్య గతంలో ధర రూ.70, ప్రస్తుత ధర రూ.60లకు తగ్గించారు. కబ్బన్ పార్క్–బెన్నిగానహళ్లి మధ్య గతంలో ధర రూ.50, ప్రస్తుత ధర రూ.40కు తగ్గించారు.
ధర తగ్గించాలని జేడీస్ ధర్నా
మెట్రో ప్రయాణ ధర పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేడీఎస్ కార్యకర్తలు, నాయకులు శుక్రవారం నగరంలోని ఫ్రీడం పార్కులో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జేడీఎస్ నగర శాఖ అధ్యక్షుడు హెచ్.రమేశ్‌గౌడ మాట్లాడుతూ తక్షణమే ధరల పెంపును రద్దు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విధాన పరిషత్ సభ్యుడు టీఏ.శరవణ, జేడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్‌ఎన్.దేవరాజు, తిమ్మేగౌడ, కే.వీ.నారాయణస్వామి ఎస్.రమేశ్, నాగేశ్వరరావు, తులసీరాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment