ఎత్తిపోతల పథకానికి టెండర్ల స్వీకరణ
ఖమ్మంఅర్బన్: రఘునాథపాలెం మండలంలో సాగు భూములకు సాగర్ జలాలు అందించేలా ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించిన విషయం విదితమే. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వలపై ఈ లిఫ్ట్‌ను నిర్మించనున్నట్లు ఇందుకోసం రూ.66 కోట్లు కేటాయించగా జలవనరుల శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. ఈనెల 28వ తేదీ వరకు టెండర్ల దాఖలకు గడువు విధిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు.
24న హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జూనియర్స్ విభాగంలో జిల్లా స్థాయి బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికకు ఈనెల 24న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పాటిబండ్ల రఘునందన్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.
30 వాహనాల సైలెన్సర్లు తొలగింపు, జరిమానా
ఖమ్మంక్రైం: వాహనాల కొనుగోలు సమయాన వచ్చిన సైలెన్సర్లను తొలగించి వింత శబ్దాలు చేసేవి బిగిస్తున్న వారిపై అందుతున్న ఫిర్యాదులతో ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఈమేరకు రెండో రోజైన బుధవారం కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 30మంది వాహనాల నుంచి సైలెన్సర్లను తీయించారు. అంతేకాక ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ మోహన్‌బాబు తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలన
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా, బీరోలులో పత్తి, ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం తేమ శాతం 17లోపు ఉంటే వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలాగే, సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్ల వివరాలు ఆరా తీయడంతో పాటు తేమ శాతాన్ని పరీక్షించారు. అనంతరం బీరోలు పాఠశాలను తనిఖీ చేసిన డీఏఓ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెనూ అమలుపై ఆరాతీశారు. మండల వ్యవసాయాధికారి నారెడ్డి సీతారాంరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.
రహదారి నిర్మాణ పనులు అడ్డగింత
వైరా: వైరా శాంతినగర్‌లో ఎకై ్సజ్ శాఖ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలాన్ని ఆనుకుని బుధవారం మున్సిపాలిటీ అధికారులు రహదారి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ మమతరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు చేరుకుని జేసీబీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్ చింతల వేణును వివరణగా అడగగా.. ఎమ్మెల్యే ఆదేశాలతో రోడ్డు నిర్మాణం మొదలుపెట్టామని తెలిపారు. ప్రజావసరాల కోసం చేపడుతున్న పనుల విషయమై ఎకై ్సజ్ అధికారులు పునరాలోచన చేయాలని కోరారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన ఖమ్మం టేకులపల్లికి చెందిన దేవరకొండ తిరుపతి రావుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.4.80 లక్షలు ఫిర్యాదికి అందజేయాలని ఖమ్మం ఆబ్కారీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన కొత్త సుదర్శన్‌రెడ్డి వద్ద తిరుపతిరావు 2014 మే 11న రూ.3 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2016 నవంబర్ 26న రూ.4.80లక్షలకు చెక్కు జారీ చేయగా బ్యాంకులో జమ చేస్తే ఖాతాలో నగదు లేనందున బౌన్స్ అయింది. ఈమేరకు న్యాయవాది బండారుపల్లి గంగాధర్ ద్వారా లీగల్ నోటీసు పంపిన సుదర్శన్‌రెడ్డి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం తిరుపతిరావుకు ఏడాది జైలు శిక్ష విధించడమే కాక నగదు చెల్లించాలని తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment