దయనీయంగా రైతుల పరిస్థితి
ఖమ్మంవ్యవసాయం: పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఫలితంగా పత్తి, వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి విక్రయాలను ఆయన పరిశీలించారు. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజ్ తదితరులతో కలిసి మార్కెట్‌కు వచ్చిన ఆయన పత్తి దిగుబడి, ధరలు ఎలా ఉన్నాయి, వరి ధాన్యానికి బోనస్ అందుతోందా, పెట్టుబడి సాయం ఇచ్చారా అని రైతులను ఆరా తీశారు. అలాగే, మహిళా కార్మికులతో మాట్లాడిన బతుకమ్మ చీరలు వచ్చాయా, గ్యాస్ సబ్సిడీ అందుతోందా, ప్రభుత్వం నెలనెలా ఇస్తానన్న రూ.2,500 ఇచ్చారా అని అడగగా రాలేదని వారు సమాధానాలు ఇచ్చారు.
బోనస్‌ను బోగస్ చేశారు...
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అడుగడుగునా కష్లాలే ఎదరవుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ హామీని అమలుచేయలేదన్నారు. రైతుబంధు పూర్తిగా నిలిపివేయగా, రుణమాఫీ కూడా అరకొరగా చేశారని విమర్శించారు. తొలుత అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఆతర్వాత వరికే పరిమితం చేశారన్నారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.7,521గా ప్రకటించినా ఖమ్మం మార్కెట్‌తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల రూ.6,500 మించి ధర లేక క్వింటాకు రూ.వెయ్యి వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ప్రభుత్వం తీరుతో మరింత అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.500 బోనస్‌ను బోగస్‌గా మార్చి..కనీస మద్దతు ధర చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందనిచెప్పారు. ఇక సీసీఐ కేంద్రాలు దళారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని పంట ధరలు, రైతుల సమస్యలపై ఎందుకు సమీక్షించడం లేదో చెప్పాలన్నారు. ఇదిపోను రైతుల పక్షాన మాట్లాడే వారిని వేధిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
పత్తికి మద్దతు ధర కల్పనలో
విఫలమైన ప్రభుత్వం
సీసీఐ కేంద్రాల్లో దళారులకే పెద్దపీట
వరి సాగు చేసిన రైతులకు
అడుగడుగునా నష్టాలే
ఖమ్మం మార్కెట్ సందర్శనలో
మాజీ మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment