జమలాపురం హుండీ ఆదాయం రూ.31.84 లక్షలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామివా రి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, ఈఓ కె.జగన్మోహన్‌రావు సమక్షాన లెక్కించగా 85 రోజులకు గాను రూ.31,84,525 ఆదాయం నమోదైంది. లెక్కింపులో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, సిబ్బందితో పాటు మధిర శ్రీసత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
జెడ్పీ డిప్యూటీ సీఈఓగా నాగపద్మజ
ఖమ్మంవన్‌టౌన్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా కె.నాగపద్మజ గురువారం విధుల్లో చేరారు. హన్మకొండ డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం బదిలీపై ఖమ్మంకు కేటాయించింది. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు స్వీకరించాక సీఈఓ దీక్షారైనాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆతర్వాత జిల్లా పరిషత్ ఉద్యోగులతో సమావేశమై అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై సమీక్షించారు.
ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. మార్చి 21న మొదటి భాష, 22న ద్వితీయ భాష, 24న ఇంగ్లిష్, 26న గణితం పరీక్షలు ఉదయం 9–30నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇక 28న ఫిజికల్ సైన్స్, 29న జీవశాస్త్రం పరీక్షలు ఉదయం 9–30నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 2న సాంఘిక శాస్త్రం ఉదయం 9–30నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, 3న ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష ఉదయం 9–30 గంటల నుంచి 11–30 గంటల వరకు జరగనుందని డీఈఓ తెలిపారు.
27, 28వ తేదీల్లో
పాత పార్సిళ్ల వేలం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కార్గో సెంటర్ నుంచి ఎవరూ తీసుకెళ్లని పార్సిళ్లను ఈనెల 27, 28వ తేదీల్లో వేలం వేయనున్నట్లు ఆర్టీసీ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల లాజిస్టిక్ మేనేజర్ వి.రామారావు తెలిపారు. ఇందులో ఎలకి్ట్రకల్ సామగ్రి, ద్విచక్ర వాహనాల విడిభాగాలు, కంప్యూటర్ విడిభాగాలు, దుస్తులు, ఫెర్టిలైజర్స్, గృహావసర వస్తువులు, టైర్లు మొదలైనవి ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఖమ్మం కొత్త బస్టాండ్ కార్గో సెంటర్ వద్ద జరిగే వేలంలో డిపాజిట్ లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
ముదిగొండ: నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి సచించారు. ముదిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీ వివరాలు, ప్రసవాలు, మందుల నిల్వలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లే తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ చందునాయక్, వైద్యాధికారి డాక్టర్ అరుణ, ఉద్యోగులు చంద్రప్రకాష్, సత్యవతి, కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment