పాలనపై తహసీల్దార్లు పట్టు సాధించాలి
● ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయించండి ● సంక్రాంతి నాటికి ధరణి దరఖాస్తులు పరిష్కారం ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: మండలంలో పాలనపై తహసీల్దార్లు పట్టు సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. తద్వారా ప్రజలు సమస్యలపై జిల్లా కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి నాటికి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో 4,400 పెండింగ్ దరఖాస్తులకు గాను 2,400 దరఖాస్తులకు కావా ల్సిన సమాచారాన్ని వెంటనే అందజేయాలని సూచించారు. అలాగే, మండల కేంద్రాల్లో ప్రజా వాణిపై విస్తృత ప్రచారం చేస్తూ జిల్లా కేంద్రానికి దరఖాస్తుదారులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. గురుకుల పాఠశాలల సందర్శన సందర్భంగా బియ్యం, సామగ్రి నాణ్యతను పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, ఈక్రమాన నోటీసులు సైతం జారీ చేయాల్సిన పనిలేదన్నారు. అలాగే, సీఎం, మంత్రుల కార్యాలయాల నుంచి వచ్చే దరఖాస్తులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్వో రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు ఆర్‌డీఓలు నర్సింహారావు, రాజేందర్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
అడవుల పెంపకంపై దృష్టి..
అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించగా, ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూముల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన అటవీ, రెవెన్యూ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1,500 హెక్టార్ల అటవీ భూమిని వివిధ ప్రాజెక్టులకుకేటాయించినట్లు తెలిపారు. ఇందుకు పరిహారం ఇతర భూమిని గుర్తించినందున విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. అటవీ భూమిని అసైన్డ్ పట్టాలు గా పంపిణీ చేసిన మిగిలిన భూములను గుర్తించాలని, సమస్యలను అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే, పోడు భూముల్లో పంట కోతల తర్వాత వరి కొయ్యలు, పంట అవశేషాలు తగులబెడితే అడవులకు నష్టం ఎదురవుతున్నందున అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, డీఆర్వో ఎం.రాజేశ్వరి, డీపీఓ ఆశాలత, ఆర్డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment