భూభారతిపైనే ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొస్తున్న భూభారతితో రైతులకు కష్టాలు తొలగిపోతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ధరణి వెబ్‌సైట్‌లో పలువురు రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాత సైట్‌ను రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో సమస్యలు తొలగిపోవడమే కాక రైతుల భూములకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో దాదాపు లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ‘ధరణి’ తప్పుల తడకగా మారడంతో తమ భూములు కోల్పోతామనే ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. సాదాబైనామాకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఆ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండగా.. కొత్త చట్టంతో వీటికే కాక ఇతర సమస్యలకూ మోక్షం లభించనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
– ఖమ్మంసహకారనగర్
భూమి ఉంది..
రికార్డుల్లో లేదు...
ఈ మహిళ పేరు మాలోతు సాద్వీ. రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన ఈమెకు రఘునాథపాలెం మండలంలోని 81, 82 సర్వే నంబర్‌లో 2.14 ఎకరాల భూమి ఉంది. పట్టా కలిగిన ఈ భూమిని సాగు చేసుకుంటున్నా ఆన్‌లైన్ రికార్డుల్లోకి మాత్రం ఎక్కలేదు. పలుసార్లు దరఖాస్తు చేస్తే సర్వే కూడా చేశారు. అధికారులను అడిగితే ఈ సర్వే నంబర్ ఖాళీ లేదని చెబుతున్నారు. కొత్త చట్టం వస్తోందని స్థానికులు చెప్పడంతో ఇకనైనా సమస్య పరిష్కారమవుతుందని సాద్వీ నమ్మకం వ్యక్తం చేసింది.
వివిధ స్థాయిల్లో దరఖాస్తులు..
భూసంబంధిత సమస్యలపై జిల్లా రైతులు వెల్లువలా దరఖాస్తులు చేసుకున్నారు. మ్యుటేషన్, నాలా, పీపీబీ, అర్బన్ ల్యాండ్ తదితర అంశాలపై ధరణి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఇవి తహసీల్దార్ వద్ద 1,949, ఆర్డీఓ వద్ద 989, అదనపు కలెక్టర్ వద్ద 764, కలెక్టర్ వద్ద 514 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో పీపీబీ డేటా సవరణలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్డీఓ వద్ద డిజిటల్ సంతకంతో సర్వే నంబర్లు లేనివి, పేరులో మార్పులు, చేర్పులకు సంబంధించి అదనపు కలెక్టర్ వద్ద, సర్వే నంబర్లు లేనివి, నోషనల్ నుంచి పట్టా మార్పు, పట్టా భూమిలో కొంత మేర అమ్మినా పేరు మారకపోవడం వంటివి పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తండ్రి పేరులో తప్పుల సవరణ, లింగం నమోదులో సవరణ, ఆధార్ నంబర్ లేనివి తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంది. ఇక కొన్ని సమస్యలను కలెక్టర్ స్థాయిలో, అక్కడ కాకపోతే సీసీఎల్‌ఏకు వెళ్లాల్సి వచ్చేది. కానీ భూభారతి చట్టం అమల్లోకి వస్తే ఆర్డీఓ స్థాయిలోనే 50 శాతానికిపైగా సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాదాబైనామాలకూ మోక్షం
ఇక ఏళ్ల క్రితం సాదా కాగితాలపై రాసుకున్న అగ్రిమెంట్లకు సంబంధించి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేసి పట్టాలు జారీచేసేందుకు ప్రభుత్వం గతంలో దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు గాను జిల్లాలో 1,11,443 దరఖాస్తులు అందాయి. అయితే దీనిపై గత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో పక్కన పెట్టేశారు. దీంతో రైతులకు నిరాశే మిగిలింది. అయితే కొత్తగా వస్తున్న భూభారతి చట్టంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం చెబుతుండడంతో రైతులకు ఊరట కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. ధరణిలో పరిష్కారం కాని అనేక సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందనే ఆశతో రైతులున్నారు.
మార్గదర్శకాలు రాగానే ప్రక్రియ
రాష్ట్రప్రభుత్వం కొత్తగా భూభారతి కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారిస్తాం. రెవెన్యూకు సంబంధించి ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించనున్నాం.
– పి.శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)
భూసమస్యల పరిష్కారంపై
నమ్మకంగా రైతులు
జిల్లాలో లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్
‘ధరణి’కి సంబంధించి
ఇంకొన్ని దరఖాస్తులు కూడా..
మార్గదర్శకాలు రాగానే ప్రక్రియ
మొదలవుతుందన్న అధికారులు
జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు..
సాదా బైనామా 1,11,443
ఇతర సమస్యలపై
తహసీల్దార్ల వద్ద ఉన్నవి 1,949
ఆర్డీఓల వద్ద పెండింగ్ 989
అదనపు కలెక్టర్ వద్ద.. 764
కలెక్టర్ వద్ద.. 514
పరిష్కారం చూపని ధరణి..
రైతులకు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెబుతూ గత ప్రభుత్వం 2020లో ‘ధరణి’ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే సమస్యల పరిష్కారం ఏమో కానీ మరిన్ని కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నా ఎటూ తెగలేదు. వెబ్‌సైట్‌లో కొందరు రైతుల భూమి వివరాలు లేకపోవడం, ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదవడం వంటి సమస్యలను మొదట్లో ఎదురయ్యాయి. సాంకేతికపరంగా ఎదురైన కొన్ని అవాంతరాలను పరిష్కరిస్తుండగానే కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇలా ఇప్పటివరకు కూడా రైతుల సమస్యలకు మోక్షం దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment