నేటి నుంచి క్రీడా పండుగ!
● పటేల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ టోర్నీ ● ఉమ్మడి జిల్లాల వారీగా హాజరుకానున్న జట్లు ● ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలో క్రీడారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడాపోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహించేందుకు వేదికలు ఖరారు చేయగా ఖమ్మంకు వాలీబాల్, ఆర్చరీ టోర్నీలు కేటాయించారు. ఈమేరకు శుక్రవారం నుంచి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వాలీబాల్ పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
పది చొప్పున జట్లు, నాలుగు కోర్టులు
ఏళ్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలుస్తున్న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ జరగనుంది. ఇందుకోసం జిల్లా యువజన క్రీడల శాఖ, వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన నాలుగు కోర్టులను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని పాత పది జిల్లాల వారీగా పురుషులు, మహిళల జట్లు కోచ్‌లు, మేనేజర్లు హాజరుకానున్నారు. మ్యాచ్‌లు లీగ్ కం నాకౌట్ విధానంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ నిర్వహిస్తామని డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
పోటీలు ఉదయం... ప్రారంభం సాయంత్రం
సీఎం కప్ క్రీడోత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ఉదయం నుంచే మొదలవుతాయి. కానీ ప్రారంభ సమావేశాన్ని మాత్రం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఉదయమే సభ ఉంటే మ్యాచ్‌ల నిర్వహణకు ఇబ్బంది అవుతుందనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈమేరకు పోటీల ప్రారంభ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొంటారని డీవైఎస్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
జిల్లా నుంచి 422మంది
సీఎం కప్‌లో భాగంగా దశల వారీగా నిర్వహిస్తున్న పోటీలు రాష్ట్ర స్థాయికి చేరాయి. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలనే భావనతో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది 24 క్రీడాంశాల్లో జిల్లా నుంచి 422 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు తరలివెళ్లగా.. ఖమ్మంలో మొదలవుతున్న వాలీబాల్ టోర్నీకి రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు ఇక్కడకు రానున్నారు.
పసందైన భోజనం
వాలీబాల్ టోర్నీకి రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు రానున్నారు. వీరికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులు వసతి సౌకర్యం కల్పిస్తుండడంతో పాటు ప్రతిరోజు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో భోజన మెనూ సిద్ధం చేశారు. ఇందుకోసం ఒక్కో క్రీడాకారుడికి డైట్ చార్జీగా రూ.300 కేటాయించినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పోటీలు జరగనుండగా ప్రతీ రోజు ఉదయం ఒక్కో రకం టిఫిన్, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండుతో పాటు పాలు లేదా టీ సమకూరుస్తారు. ఇక మధ్యాహ్నం మూడుకు పైగా కూరలు, సాంబార్, పెరుగు, సాయంత్రం స్నాక్సే కాక రాత్రివేళ మూడు రోజుల పాటు చికెన్ సహా పలు రకాల కూరలతో భోజన మెనూ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment