పరవళ్లు...
సాగర్ జలాల
యాసంగి సాగులో నిమగ్నం
ఇప్పటికే ఖరీఫ్‌లో సాగుచేసిన వరి కోతలతో పాటు పత్తి తీత పూర్తికాగా యాసంగి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధి 17 మండలాల్లో 2.54 లక్షల ఎకరాలకు ఎక్కువగా వరి సాగుకే సై అంటున్నారు. సాగర్ జలాలతోపాటు చెరువులు, కుంటల్లో నీరు ఉండడం, ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న నేపథ్యాన బోర్లు, బావుల కింద కూడా రైతులు వరి సాగుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం దుక్కులు దున్నడం, నారు మడి వేయడం ప్రారంభమవగా, కొన్ని ప్రాంతాల్లో రైతులు నాట్లు కూడా వేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధరకు తోడు బోనస్‌గా రూ.500 చెల్లించింది. దీంతో రబీలోనూ వరిలో సన్నరకాలవైపే మొగ్గు చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే, ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, వేరుశనగ వంటి పంటలు కొద్ది మేర సాగవనున్నాయి.
వారబందీలో విధానంలో విడుదల
ఈనెల 15నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మొదటి విడతగా నీటి విడుదల 27రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత తొమ్మిది రోజులు నిలిపేస్తారు. ఇక రెండో తడి నుంచి తొమ్మిది రోజులు నీరు విడుదల చేస్తూ ఆరు రోజులు నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో రైతులు సాగుకు నీటి కొరత రాదనే నమ్మకంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, సాగర్ జలాల విడుదలతో జిల్లాలోని కాల్వలన్నీ నిండా నీటితో కళకళలాడుతున్నాయి.
వరి సాగు వద్దు..
ఓ పక్క రైతులు సాగు పనుల్లో నిమగ్నం కాగా.. అధికారులు యాసంగిలో వరి పంట వేయొద్దని కోరుతున్నారు. జిల్లాకు వారబందీ విధానంలో నీరు విడుదలవుతున్నందున ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాకాకుండా ఎక్కువగా వరి సాగు చేస్తే చివరి ఆయకట్టుకు నడి వేసవిలో నీరు అందక ఇక్కట్లు ఎదురవుతాయని అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనూ ఇలా జరిగి రైతులు నష్టపోయారని చెబుతున్నారు. కాగా, జిల్లాలోని 17 మండలాల పరిధి 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టులో సాగు పనులు మొదలవుతున్నందున ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించేలా జలవనరుల శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ రైతులు మాత్రం వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
సాఫీగా సాగనున్న
యాసంగి సాగు
వారబందీ విధానంలో
ఏప్రిల్ 23 వరకు నీటి విడుదల
ఆరుతడి పంటల సాగుపై
అధికారుల అవగాహన
జిల్లా రైతాంగం మాత్రం వరి వైపే మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment