అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ జోరు
గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపును 2024లోనూ కొనసాగించింది. ఇక శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌లో స్తబ్దత నెలకొనగా ఇద్దరు, ముగ్గురు నేతలు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ చర్యలపై నిరసన తెలుపుతూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పార్టీ అంతగా కలిసిరావడం లేదు. ఇక జిల్లాలో పాగా వేయాలని చూసిన బీజేపీకి ఫలితం దక్కకపోగా, కమ్యూనిస్టులు మాత్రం ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా నిరసనలు, ఆందోళనలు చేపడుతూ జనంతో మమేకమవుతున్నారు. మూడు రోజుల్లో ముగియనున్న ఈ సంవత్సరంలో రాజకీయాల పరిస్థితి ఇలా ఉంటే.. ఈ ఏడాది వరదలు ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాలను అతలాకుతలం చేశాయి. వేలాది మంది సర్వం కోల్పోగా, పంటలు నీట మునిగి రైతులపై కోలుకోలేని దెబ్బ పడింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
● ఇంకోపక్క పట్టు నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ పాట్లు ● బలం పుంజుకునే ప్రయత్నాల్లో కమ్యూనిస్టులు ● ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైన జిల్లా
●పని చేయని బీజేపీ మ్యాజిక్
జిల్లాలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. అసెంబ్లీ ఫలితాలు బెడిసికొట్టగా లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తరఫున కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు ప్రచారం చేసినప్పటికీ గెలుపు దరిదాపులకు కూడా రాలేదు. మరోపక్క ఓటు బ్యాంక్ సైతం పెరగకపోవడంతో గతంలో మాదిరి జిల్లాపై పార్టీ ఫోకస్ కొంత తగ్గించింది.
●ప్రజల బాటలో కామ్రేడ్లు
సీపీఐ, సీపీఎం నేతలు జిల్లాలో ఉనికి చాటుకునే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. సీపీఐకి అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ జిల్లాలో ప్రజాసమస్యలపై గళం విప్పుతోంది. సీపీఎం సైతం పలు సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది. సీపీఎం జిల్లా మహాసభలను ఇటీవల సత్తుపల్లిలో నిర్వహించగా జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర నేతలు హాజరయ్యారు. ఇక సీపీఐ శత వార్షిక వేడుకలను ఖమ్మం నిర్వహించగా పెద్దసంఖ్యలో శ్రేణులు పాల్గొన్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వెనుకబడినప్పటికీ ఉభయ కమ్యూనిస్టులు ప్రజల్లో పట్టు కోల్పోకుండా ఉద్యమాలు చేపడుతున్నారు.
● ఆగస్ట్ 15 : వైరాలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల్లోపు రైతుల రుణాలు మాఫీ చేశారు.
●కనీవిని ఎరుగని వరద..
ఈ ఏడాది జిల్లాపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. వరదలతో వందలాది మంది నిరాశ్రయులు కాగా.. పంట చేలన్నీ దెబ్బతిన్నాయి. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతోపాటు ఎగువ నుంచి వరద రావడంతో మున్నేరు నదితోపాటు పాలేరు రిజర్వాయర్ పొంగి పొర్లింది. మధిర నియోజకవర్గం, మున్నేరు పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, ఖమ్మంరూరల్ ప్రాంతాల్లోని కాలనీలను వరద ముంచెత్తింది. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్‌లోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని 70 కాలనీల్లోకి నీరు చేరడంతో 15 వేల ఇళ్ల వరకు పూర్తిగా ధ్వంసయ్యాయి. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, సామగ్రి వరద పాలై కాలనీవాసులు సర్వస్వం కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా ఈ వర్షాలు, వరదలతో దాదాపు రూ.339 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment