కేజీబీవీల్లో పోలీసు సిబ్బంది
● ఉద్యోగుల సమ్మె నేపథ్యాన భద్రతా ఏర్పాట్లు ● బోధనకు సైతం ప్రత్యామ్నాయాలపై దృష్టి
విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో కేజీబీవీల్లో విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్నాళ్ల బోధనా సిబ్బంది మాత్రమే సమ్మెలో ఉండగా, శుక్రవారం నుంచి డే అండ్ నైట్ డ్యూటీ సిబ్బంది కూడా సమ్మెకు దిగుతున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతకు పోలీసు సిబ్బందిని కేటాయించారు. ఇక ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలనే ఆలోచన ఉంది.
– సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి
ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ఇతర సమస్యల పరి ష్కా రం కొన్నాళ్లుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అయితే, కస్తూర్బాగాంధీ విద్యాల యాల(కేజీబీవీ)ల్లో డే అండ్ నైట్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సైతం సమ్మెలోకి వస్తున్నారని ఆ సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖాధికారికి ఇటీవల వినతిపత్రం సమర్పించారు. దీంతో కేజీబీవీల్లో బాలికల భద్రతతో పాటు బోధన విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసు అధికారులతో మాట్లాడారు. అలాగే, ఉన్నతాధికారులు సూచనల మేరకు జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఇద్దరేసి పోలీసు సిబ్బంది(హోంగార్డు /కానిస్టేబుల్)కి విధులు కేటాయించారు. అంతేకాక స్థానిక రెవెన్యూ, విద్యాశాఖ సిబ్బంది సైతం కేజీబీవీలకు చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.
318మంది ఉద్యోగులు
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 14 కేజీబీవీలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఎమ్మార్సీ తదితర విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 586మంది విధులు ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కేజీబీవీల్లోనే 318మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా సమ్మెలోకి దిగడంతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కేజీబీవీల్లోని బోధన సిబ్బంది సమ్మెకు దిగడం, ప్రభుత్వం తరఫున చర్చలేవీ జరకపోవడంతో విద్యార్థినులు నష్టపోకుండా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం రెండు రోజుల్లోగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి బోధన ప్రారంభిస్తారని సమాచారం. అంతేకాక పర్యవేక్షణ కోసం కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లుగా అదే మండల పరిధిలోని సీనియర్ హెచ్‌ఎంలను నియమించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment