దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది..
● మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతిపై మంత్రి పొంగులేటి
ఖమ్మంమయూరిసెంటర్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాక గొప్ప చట్టాల రూపకల్పనలో పాలుపంచుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతితో దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మృతికి సంతాపంగా ఖమ్మంలోని క్యాంపు కార్యాయలంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆయన చిత్రపటం వద్ద మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్‌సింగ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంతేకాక ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.
సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి
ఎర్రుపాలెం: తెలంగాణ – ఏపీ సరిహద్దు మీదుగా ధాన్యం, ఇతరత్రా ఏవి కూడా అక్రమంగా రవాణా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఎర్రుపాలెంలోని పోలీస్‌స్టేషన్‌ను గురువారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, సిబ్బంది పనితీరు, కేసుల నమోదు, విచారణ వివరాలపై ఆరా తీశాక సీపీ మాట్లాడారు. సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు చేపడుతూ అక్రమార్కులను కట్టడి చేయాలని సూచించారు. అలాగే, పాత నేరస్తుల కదలికలను పరిశీలించాలని తెలిపారు. ఆతర్వాత సీపీ సునీల్‌దత్ దంపతులు మండలంలోని జమలాపురంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సందర్శించి శ్రీవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కొణిజర్ల: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ రోజారాణి తెలిపారు. హౌస్ వైరింగ్, ద్విచక్ర వాహనాలు, ఏసీ మరమ్మతు అంశాల్లో నెల పాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్‌లో వచ్చేనెల 1, 3, 4వ తేదీల్లో శిక్షణ మొదలవుతుందని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి 100 రోజుల పని దినాలు పూర్తిచేసిన కుటుంబాల్లో యువతకు డీఆర్‌డీఏ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు వివరాల కోసం తరుణీ హాట్‌లో సంప్రదించాలని ఎంపీడీఓ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment