పకడ్బందీగా ‘ఇందిరమ్మ’ దరఖాస్తుల సర్వే
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల సర్వే పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండా, జలగంనగర్, కేఎంసీ పరిధిలోని మోతీనగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన సర్వేను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ సర్వే విషయాన్ని దరఖాస్తుదారులకు ముందస్తుగా సమాచారం ఇస్తే వారు అన్ని పత్రాలు సిద్ధం చేసుకుంటారని తెలిపారు. తద్వారా ఎన్యుమరేటర్లు కూడా త్వరగా సర్వే పూర్తిచేయొచ్చన్నారు. ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలని, ఆపై వివరాల నమోదుకు అవసరమైతే అదనపు లాగిన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సర్వే సమయాన అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించడమే కాక దరఖాస్తుదారుల ప్రస్తుత స్థితిగతులను వివరించేలా ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్డీఓ సన్యాసయ్య, హౌజింగ్ పీడీ బి.శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీ.పీ.గౌతమ్
Comments
Please login to add a commentAdd a comment