మెరుగైన వైద్య సేవలందించాలి
● కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ వైద్య సేవలుండాలి ● ఖమ్మం ఆస్పత్రిని 575 పడకలకు పెంచాలి ● ఆస్పత్రుల పనితీరుపై మంత్రి తుమ్మల సమీక్ష
ఖమ్మంవన్‌టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణితో కలిసి హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, వసతులు, వైద్య కళాశాల స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పేదలకు ఖరీదైన వైద్యసేవలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందించాలని సూచించారు. అన్ని వసతులు, అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ వైద్య సేవలు ఉండాలని చెప్పారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో గతంలో 500 పడకలు ఉండగా కరోనా సమయంలో 420కి తగ్గించారని, మళ్లీ 575 పడకలకు పెంచేలా ప్రతిపాదనలు పంపామని, దానిని తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం, కల్లూరు, సత్తుపల్లి తదితర ఆస్పత్రుల్లో ఆధునిక హంగులతో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఖాళీ పోస్టుల భర్తీకి ఆదేశం..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి తుమ్మల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎక్కడా వసతులు, పరికరాలు లేవనే మాట వినిపించవద్దన్నారు. వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, వైద్య పరీక్షల నిర్వహణకు టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఆపద సమయంలో అత్యవసర సేవలు అందించేందుకు 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచాలని అఽధికారులను ఆదేశించారు.
సంక్రాంతి తర్వాత మెడికల్ కాలేజీకి శంకుస్థాపన..
సంక్రాంతి తర్వాత మెడికల్ కళాశాల పనుల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం అద్భుతంగా, ఆత్యాధునికంగా ఉండాలన్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని మంత్రి రాజనర్సింహను కోరగా, పరిశీలించి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
నేటి నుంచి మూడు రోజులు పర్యటన
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురు, శుక్ర, శనివారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మం టేకులపల్లిలో డైట్ కాలేజీ ఆదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశాక, 11.30 గంటలకు తల్లాడ మండలం నూతనకల్‌లో సహకార భవనం ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సత్తుపల్లి బుగ్గపాడులో ఆర్‌అండ్‌బీ రోడ్డు, 10 గంటలకు కాకర్లపల్లిలో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, 10.30 గంటలకు సత్తుపల్లిలో సింగరేణి ఆగ్రికల్చర్ గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు రామగోవిందాపురంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు దమ్మపేట మండలం కట్కూర్‌లో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 11 గంటలకు పూసుకుంటలో పామాయిల్ మొక్కలు నాటుతారు.
Comments
Please login to add a commentAdd a comment