రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలి
ఖమ్మంసహకారనగర్: రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రైతు బీమా కింద 420 దరఖాస్తులు వస్తే వ్యవసాయ శాఖ నుంచి 347 దరఖాస్తులు ఎల్‌ఐసీకి సమర్పించామని, 311 రైతు కుటుంబాలకు క్లెయిమ్ సొమ్ము అందిందని, 36 పురోగతిలో ఉన్నాయని వివరించారు. వ్యవసాయ అధికారులు మానవీయ దృక్పథంతో పని చేయాలని, రైతుల దరఖాస్తుల్లో ఏవైనా డాక్యుమెంట్లు లేకుంటే సమకూర్చే మార్గం తెలియజేయాలని సూచించారు. ఏఈఓలు క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పని చేయాలని, వారి పనితీరు మెరుగుపడేలా మండల వ్యవసాయ అధికారులు సహకరించాలని అన్నారు. క్రాప్ బుకింగ్ సర్వే పకడ్బందీగా చేయాలన్నారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలోని పెద్ద రైతులను, స్థానిక నాయకులను గుర్తించి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని, ఆ పంట సాగయ్యేలా చూడాలని సూచించారు.
24 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు..
జిల్లాలో నాలుగు ప్రదేశాల్లో 24 ఎకరాల స్థలాన్ని సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గుర్తించామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకా 150 ఎకరాల మేర స్థలం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో తదుపరి చర్యలకు కార్యాచరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పంపిణీకి ‘డబుల్’ ఇళ్లు సిద్ధం..
ఖమ్మంరూరల్: ప్రభుత్వ లక్ష్యం మేరకు సంక్రాంతి లోపు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మండలంలోని మల్లెమడుగులో మూడు బ్లాక్‌ల్లో నిర్మిస్తున్న 84 డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి లోపు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీకి సిద్ధం చేయాలని తెలిపారు. మల్లెమడుగులో 84, కూసుమంచి మండలం దుబ్బతండాలో 29, నేలకొండపల్లి మండలం అచార్లగూడెంలో 18.. మొత్తం 131 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం వరంగల్ క్రాస్‌రోడ్‌లోని లెప్రసీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు రేషన్‌కార్డులు లేవని, ఆస్పత్రి అందుబాటులో లేదని కలెక్టర్‌కు విన్నవించగా మార్చిలో అర్హులందరికీ కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, విద్యుత్ ఎస్‌ఈ సురేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, డీఏఓ డి. పుల్లయ్య, హార్టికల్చర్ అధికారి ఎం.వి. మధుసూదన్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్‌డీఓ నర్సింహారావు, ఖమ్మంరూరల్, అర్బన్ తహసీల్దార్లు పి. రాంప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment