అద్దె చెల్లించలేదని గురుకులానికి తాళం
ఖమ్మంఅర్బన్: నెలల తరబడి అద్దె చెల్లించక, విద్యుత్ బిల్లు కూడా బకాయి ఉండడంతో గురుకుల పాఠశాల భవనానికి యాజమాన్యం తాళం వేసింది. దీంతో సెలవులకు వెళ్లొచ్చిన విద్యార్థులు బయటే ఉండగా అధికారుల వినతితో తాళం తీయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం పుట్టకోట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ భవనంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాల కొన్నేళ్లుగా కొనసాగుతుంది. ఇందులో 570మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఎనిమిది నెలల అద్దె, విద్యుత్ బకాయిలు కలిపి మొత్తంగా రూ.35లక్షల పైగానే యజమాన్యానికి చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చినా స్పందన లేక భవనానికి తాళం వేసినట్లు సమాచారం. ఈమేరకు సంక్రాంతి సెలవులకు వెళ్లిన విద్యార్థులు సోమవారం 175 మంది వరకు రావడంతో తాళం వేసి ఉండగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గురుకులాల జోనల్ అధికారి స్వరూపారాణి, ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఒకటి, రెండు రోజుల్లో విద్యుత్ బిల్లు బకాయి, త్వరలోనే అద్దె కూడా చెల్లిస్తామని చెప్పడంతో భవన యజమానులు తాళం తీశారు. కాగా, ఎక్కడా విద్యార్దులకు ఇబ్బంది ఎదురుకాలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment