అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంరూరల్/ఖమ్మంఅర్బన్: ప్రభుత్వం ఈనెల 26న నుంచి అమలుచేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఈ విషయంలో ఎవరూ ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, ఖమ్మం 11వ డివిజన్‌లోని కవిరాజ్‌నగర్‌లో సోమవారం పర్యటించిన ఆయన రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉద్యోగులు చేస్తున్న సర్వేను తనిఖీ చేశారు. తప్పిదాలు దొర్లకుండా క్షేత్రస్థాయి సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. రైతు భరోసాలో అనర్హుల పేర్లు తొలగించేందుకు మైనింగ్ లీజు, వెంచర్లు, ఇటుకబట్టీలు ఏర్పాటైన భూములను పరిశీలించాలన్నారు. కాగా, తొలి విడతగా స్థలం ఉన్న వారికి, ఆ తర్వాత మిగతా వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నందున పేదలు అపోహలకు గురికావొద్దని సూచించారు. అంతేకాక పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి మొదలయ్యే గ్రామసభల్లో లబ్ధిదా రుల ప్రాథమిక జాబితాలు ప్రదర్శించనున్నందున అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment