మట్టిలో కలిసినట్లే..
రికవరీ కష్టమే
ఆయిల్‌ఫెడ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన మొక్కలకు సంబంధించి రికవరీ చేసిన దాఖలాలు లేవని సమాచారం. కోస్టారికా దేశం నుంచి దిగుమతి చేసుకున్న మూడు లక్షల పిలక మొక్కలు ఆఫ్‌టైప్‌గా ఉన్నాయని ప్రభుత్వం ఆ దేశానికి నివేదిక ఇస్తే రీప్లేస్‌మెంట్ లేదా పరిహారం చెల్లింపునకు అంగీకరించే అవకాశముంది. అయితే, ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ జరిగిన దాఖలాలు లేవని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు.
2022 నుంచి రేగళ్లపాడులో నర్సరీ..
మన రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తుండగా రైతులకు సబ్సిడీపై మొక్కలు సరఫరా చేస్తారు. ఈమేరకు ఇండోనేషియా, మలేషియా, కోస్టారికా దేశాల నుంచి పామాయిల్ పిలక మొక్కలను దిగుమతి చేసుకుంటారు. పిలక మొక్కల కోసం ఆర్డర్ పెడితే కనీసం 18 నెలల తర్వాత సరఫరా చేస్తారు. కాగా, పెనుబల్లి మండలం బయన్నగూడెంలో ఉన్న ఆయిల్‌ఫెడ్ నర్సరీని 2022లో సత్తుపల్లి మండలం రేగళ్లపాడుకు మార్చారు. అప్పటి నుంచి మూడు విడతలుగా ఆయిల్‌పామ్ మొక్కలను తెప్పించగా మొదటి ఏడాది కోస్టారికా దేశం నుంచి వచ్చిన మూడు లక్షల మొక్కలను గతంలో రైతులకు అందించారు. ఇక రెండో విడత ఇండోనేషియా నుంచి ఆరు లక్షల మొక్కలు దిగుమతి చేసుకుని దఫాల వారీగా రైతులకు పంపిణీ చేస్తున్నారు.
గ్రేడింగ్ చేసే కొద్దీ...
మూడో దశలో మళ్లీ కోస్టారికా దేశం నుంచే మూడు లక్షల మొక్కలను 2023 జూలైలో దిగుమతి చేసుకున్నారు. అయితే, మొక్కలు ఆరు నెలల వరకు ఎదుగుదల లేకపోవడంతో పలు దఫాలుగా అధికారులు పరీక్షించారు. 2024 జూలైలో అప్పటి హార్టికల్చర్ అధికారి భారతి ఏడాది వయస్సు కలిగిన మొక్కలను పరీక్షించి ఎదుగుదల లేదని తేల్చారు. దీంతో ఓసారి గ్రేడింగ్ అనంతరం 80 వేల మొక్కలు పూర్తిగా పనికిరావని ధ్వంసం చేశారు. ఆపై 2.20 లక్షల మొక్కల్లో మళ్లీ గ్రేడింగ్ చేసి 1.50 లక్షల మొక్కలను విడిగా పెంచాలని నిర్ణయించారు. మిగిలిన 70వేల మొక్కల్లో 20వేల మొక్కలు కూడా పనికిరానివని పక్కనపెట్టగా, 50వేల మొక్కలు కొన్నాళ్లు వేచి చూసినా కొన్ని ఎదగగా, మరికొన్ని ఎదగలేదు. అయితే, విడిగా పెంచుతున్న 1.50 లక్షల మొక్కలు ఒకే రీతిలో ఎదగకపోవడంతో గతేడాది డిసెంబర్‌లో పరిశీలించిన ప్రభుత్వ ఆయిల్‌ఫెడ్ సలహాదారుడు రాజశేఖర్‌రెడ్డి అవి కూడా ఆఫ్ టైప్ (పనికి రావు) అని తేల్చినట్లు సమాచారం. ఇలా మొత్తం మీద మూడు లక్షల మొక్కలు పనికిరానివని నిర్ధారించటంతో ఆయిల్‌ఫెడ్ సంస్థకు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఆయిల్‌ఫెడ్‌లో కోల్డ్‌వార్
ఆయిల్‌ఫెడ్ అధికారుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధంతో ఇన్నాళ్లు కప్పిపుచ్చిన లోపాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నట్లు సమాచారం. అధికారులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నట్లు తెలిసింది. ఆయిల్‌ఫెడ్ నర్సరీలో ఆధిపత్యం కోసం ఓ అధికారిపై చర్యలు తీసుకుని ఆయన సీనియారిటీ తగ్గించడం ద్వారా మరో అధికారికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. కాగా, రేగళ్లపాడు ఆయిల్‌ఫెడ్ నర్సరీకి ఈనెల 9నుంచి 11వ తేదీ వరకు విచారణాధికారిగా వచ్చిన ప్రవీణ్‌రెడ్డి ఇంకా నివేదిక సమర్పించలేదని తెలిసింది. కాగా, ఈ విషయమై ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, విచారణాధికారి ప్రవీణ్‌రెడ్డి వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
3లక్షల ఆయిల్‌పామ్ మొక్కలు పనికిరావట..
రేగళ్లపాడు నర్సరీలో పక్కన పెట్టేసిన అధికారులు
ఆయిల్‌ఫెడ్‌కు రూ.2 కోట్ల మేర నష్టం
విచారణ నివేదిక బయటపెడితే వెలుగుచూడనున్న నిజాలు
కోస్టారికా దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్‌పామ్ మొక్కలు జన్యుపరమైన లోపాలతో ఎదుగూబొదుగు లేకుండా ఉండడంతో నాటడానికి పనికి రావని తేల్చారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లక్షల మొక్కలు ఆఫ్ టైప్(పనికి రావు) అని గుర్తించడం ఆయిల్‌ఫెడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సత్తుపల్లి మండలం రేగళ్లపాడులోని ఆయిల్‌ఫెడ్ నర్సరీకి 2023 జూలైలో రూ.1.80 కోట్లు వెచ్చించి కోస్టారికా దేశం నుంచి మూడు లక్షల మొక్కలు తెప్పించారు. అయితే, ఈ మొక్కలను ఇంకా రైతులకు పంపిణీ చేయకున్నా విడతల వారీగా పనికి రావని తేలుతున్న నేపథ్యాన గత మూడేళ్లలో జరిగిన మొక్కల లావాదేవీలపై ఆయిల్‌ఫెడ్ అధికారులు అంతర్గత విచారణ చేపడుతున్నారు. – సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment