కల్లూరు: జిల్లాలోని మామిడి తోటలు ప్రస్తుతం మొగ్గ, పూత దశలలో ఉన్నందున తేనెమంచు పురుగు, పూతగూడు పురుగులతో పాటు ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశముందని వైరా కేవీకే శాస్త్రవేత్త చైతన్య తెలిపారు. ఈనేపథ్యాన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్లూరులోని పలువురు రైతుల మామిడితోటలను మంగళవారం పరిశీలించిన ఆయన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. తోటల నీటి నిల్వలు లేకుండా చేస్తే తేనె మంచు పురుగు ఉధృతి తగ్గుతుందని, పూత, పిందెలు తయారయ్యే సమయాన ఆకులపైనే కాక మొదళ్లు, కొమ్మలపై మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డై మిథలియేట్ 2 మి.లీ. లేదా క్లోరీ ఫైరీఫాస్ 2.5 మి.లీ.ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మొగ్గ దశలో తెగులు కనిపిస్తే థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. లేదా బ్యూఫ్రిపేషన్ 1–2 మి.లీ.ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పురుగును సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. పిందె బఠానీ గింజ నుంచి నిమ్మకాయ సైజ్‌లో ఉన్నప్పుడు మంగు, తామర పురుగుల నివారణకు పిఫ్రోనిల్ 2 మి.లీ., ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డై మిథోయేట్ 2 మి.లీ.ను నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవికుమార్, హెచ్‌ఓ జి.నగేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment