ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు
ముదిగొండ: ఆటో బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు.. నేలకొండపల్లి మండలం చెరువుమాదారానికి చెందిన 11మంది కూలీలు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లిలో వరినాట్లు వేసేందుకు మంగళవారం ఉదయం ఆటోలో బయలుదేరారు. ముదిగొండ మండలం వల్లబిలోని పెట్రోల్ బంక్ నుంచి ఓ ద్విచక్రవాహనదారుడు ఒకేసారి రహదారిపైకి రావడంతో తప్పించే క్రమాన కూలీల ఆటో బోల్తాపడింది. దీంతో అమగాని రాంబాయి, పగిడిపర్తి లక్ష్మి, బొల్లికొండ విజయ, పాలకుర్తి వెంకటేశ్వర్లు, ఎస్.కే.రజియా, సూరపల్లి ఇందిరమ్మ, కొమ్ము రాణి, మొగిలి వీరలక్ష్మి, నందిగామ ఉమ, కుక్కల విజయమ్మ, పాలకుర్తి వెంకమ్మ గాయపడగా వల్లబిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నీటి సంప్‌లో పడి వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: కూలీకి వెళ్లిన వ్యక్తికి ఫిట్స్ రావడంతో సంప్‌లో పడగా మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలోని ఓ వ్యక్తి ఇంట్లో నీటి సంప్ శుభ్రం చేయడానికి పెనుబల్లి మండలం టేకులపల్లికి చెందిన గోళ్లమందల పుల్లారావు(42) మంగళవారం వచ్చాడు. నీళ్లు తోడుతుండగా ఆయనకు ఫిట్స్ రావడంతో అందులో పడిపోయాడు. కాసేపయ్యాక గమనించిన స్థానికులు పుల్లారావునుబయటకు తీసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్యతో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఆరు నెలల పసికందుతో భార్య రాణి, పుల్లారావు తల్లి తదితరులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment