సంక్షేమంపై ఆందోళన వద్దు...
● గ్రామసభల్లో అన్నీ విచారించాకే తుది జాబితా ● అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం: సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని కేశ్వాపురం, తిప్పారెడ్డిగూడెం, హైదర్‌సాయిపేట, పడమటితండా, చంద్రుతండా, మహ్మదాపురం, ఇస్లావత్‌తండా గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు, జోగులపాడులో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నాలుగు పథకాల అమలుకు నిర్వహిస్తున్న గ్రామసభల్లో చదివేది తుది జాబితా కాదని, ప్రజల నుంచి అందే అభ్యంతరాలు స్వీకరిస్తామని.. ఆపై దరఖాస్తులు కూడా తీసుకున్నాక అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించే బాధ్యత తనదని చెప్పారు. ఈనేపథ్యాన జాబితాలో పేరు లేకున్నా ఆందోళన పడొద్దని సూచించారు. జాబితా లో అనర్హులు ఉన్నట్లు లిఖితపూర్వకంగా తెలియచేస్తే విచారించి తొలగిస్తామని తెలిపారు. ఈనెల 26నుంచి నాలుగు పథకాల అమలు మొదలవుతుందని, ఆతర్వాత కూడా దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక కొనసాగుతుందని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
దెబ్బతిన్న చోట కొత్త రోడ్లు
గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే, వచ్చే వర్షాకాలం నాటికి పాలేరు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన ప్రతీ వీధిలో సీసీ రోడ్లు, అవసరమైన చోట లింక్ రోడ్లు నిర్మించడమే కాక వరదలో పాడైన రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపినా ప్రజల సంక్షేమం కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పీ.వీ.రామకృష్ణ ఎంపీడీఓ సిలార్ సాహెబ్, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, చావా శివరామకృష్ణ, మంగీలాల్, అశోక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment