నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఖమ్మం 8వ డివిజన్‌లో బల్లేపల్లి నుండి బాలపేట వరకు రోడ్డు విస్తరణ పనులకు, 15వ డివిజన్‌లో అల్లీపురం నుండి రామకృష్ణాపురం, అల్లీపురం నుండి జంగాలకాలనీ వరకు రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.
గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎం.రాజ్యలక్ష్మి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 23న పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు రూ.100 రుసుము చెల్లించి ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, 6నుండి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీ, గౌలిదొడ్డిలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, అలుగునూరు సీఓఈల్లో 9వ తరగతి, రుక్మాపూర్‌లోని సైనిక్ స్కూల్‌లో, మల్కాజిగిరిలోని ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు సైతం పరీక్ష ఉంటుందని తెలిపారు.
పరీక్షల వేళ
ఒత్తిడిని జయిస్తేనే ఫలితం
ఖమ్మంమయూరిసెంటర్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యాన విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా సిద్ధమైతే మెరుగైన పలితాలు వస్తాయని అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్‌శ్రేష్ట తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్‌లోని తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల–1ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. అలాగే, అవసరమైన స్టడీ మెటీరియల్, క్రీడా కిట్లు సమకూరుస్తానని తెలిపారు. అనంతరం విద్యార్థినులపై పాటే నేలపై కూర్చున్న అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు చొరవ తీసుకోవాలన్నారు. ఈక్రమంలో విద్యార్థిని ఆయేషా షిరీన్ అసిస్టెంట్ కలెక్టర్ చిత్రాన్ని గీయగా అభినందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిసి కార్యాలయంలో కలిసి అవసరమైన సదుపాయాలను కల్పించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ ప్రమాదాలకు చెక్
● 11 కేవీ లైన్ల మార్పునకు రూ.8.88 కోట్లు
కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇళ్ల మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ల కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలుచోట్ల ఎప్పుడేం ప్రమా దం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యు త్ లైన్లను మార్చేందుకు అవసరమైన రూ.8.88 కోట్లు మంజూరు చేయించారు. ఈమేరకు గురువారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల్లో రూ.4.23 కోట్లను విద్యుత్ లైన్ల పొడిగింపునకు, మిగతా రూ.4.65 కోట్లను విద్యుత్ లేన్ల మార్పిడికి వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment