మరో లక్షన్నర..
నాలుగు పథకాలకు దరఖాస్తుల వెల్లువ
● చివరిరోజూ గ్రామసభల వద్ద జనం బారులు ● అధికారులపై ప్రశ్నల వర్షం, అనర్హులను ఎంపిక చేశారని అసంతృప్తి ● కొన్నిచోట్ల మధ్యలోనే సభలకు బ్రేక్
మండలాల్లో గ్రామసభలు ఇలా..
●రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం సభలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందని అధికారులను నిలదీశారు. ఆందోళకారులకు మార్కెట్ చైర్మన్ హనుమంతరావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు
●వైరా మండలం విప్పలమడక సభలో అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సీపీఎం రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ని సర్వేలు చేసినా ఫలితం లేకపోగా, మరోమారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడాన్ని తప్పుపట్టారు.
●కొణిజర్ల మండలం తనికెళ్ల సభ వద్ద ప్రజలు బారులు దీరారు. సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు.
●సింగరేణి మండలంలోని కారేపల్లి, విశ్వనాథపల్లి, ఉసిరికాయలపల్లిల్లో గ్రామసభలు గందరగోళంగా సాగాయి. అర్హులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ బీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ నేతలతోపాటు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో కారేపల్లి సభ నుంచి అధికారులు అర్ధంతరంగా వెళ్లిపోయారు.
●ముదిగొండలో నిర్వహించిన గ్రామసభ అరుపులు, కేకలతో దద్దరిల్లింది. తమ పేర్లు జాబితాల్లో లేవని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఈ గ్రామసభకు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హాజరయ్యారు.
●ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం, తల్లంపాడు, మంగళగూడెంలో ఇళ్లు ఉన్న వారికి ఇళ్లు ఇచ్చారని, మిగతా పఽథకాల్లో కూడా అనర్హులను ఎంపిక చేశారని అధికారులను దీశారు.
●తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రణతిని గ్రామస్తులు నిర్బంధించారు. సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
●నేలకొండపల్లి గ్రామసభలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అరుపులు, కేకలు మిన్నంటాయి. జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు పోటెత్తారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజాపాలన సభల్లో దరఖాస్తుల స్వీకరణ, వీటి ఆధారంగా ఉద్యోగుల ఇంటింటి సర్వేలు.. ఆపై సంక్షేమ పథకాల అమలుకు రూపొందించిన అర్హుల జాబితాలపై జిల్లావ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి అమలుచేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు ప్రాథమికంగా రూపొందించినట్లు చెబుతున్న జాబితాల ప్రదర్శనకు మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రామ, వార్డుసభల్లో దాదాపు అన్నిచోట్లా ఉద్యోగులపై తిరగబడ్డారు. అర్హుల పేర్లను చేర్చకపోగా అనర్హులకు చోటు కల్పించారని మండిపడ్డారు. నిరసనలు, నిలదీతల నడుమే సభలు కొనసాగగా అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్న సూచనతో ఈ సభలు దరఖాస్తుల స్వీకరణ సభలుగా మారాయి. ఇలా మూడు రోజుల్లో జిల్లాలో నిర్వహించిన సభల్లో నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు అందడం గమనార్హం. అయితే, దరఖాస్తుల సంఖ్యపై శుక్రవారానికి మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఆగ్రహ జ్వాలలు
జిల్లాలోని 589 గ్రామపంచాయతీలు, ఖమ్మం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లతో పాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని 65వార్డుల్లో మూడు రోజుల పాటు గ్రామ, వార్డు సభలను నిర్వహించారు. అన్ని సభల్లోనూ సంక్షేమ పథకాలకు ప్రదర్శించిన జాబితాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాబితాల్లో అనర్హులు ఉన్నారని, అర్హులకు చోటు కల్పించలేదని అధికారులను నిలదీశారు. కొన్నిచోట్ల నిరసనలు తీవ్రరూపం దాల్చ డంతో అధికారులు సభలను మధ్యలోనే ముగించి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక చివరిరోజైన గురువారం కూడా ఇదే పరిస్థితి నెలకొనగా పలుచోట్ల బీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ నేతలు గ్రామస్తులకు మద్దతుగా నిరసన తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రకటించింది తుది జాబితా కాదని, ఇక్కడ అభ్యంతరాలు స్వీకరించి విచారణ అనంతరం అనర్హులను తొలగిస్తామని అధికారులు నచ్చచెప్పారు. కానీ సర్వే నిర్వహించి మరీ అనర్హులకు ఎలా చోటు కల్పించారని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
సభలను సందర్శించిన కలెక్టర్..
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మూడు రోజుల్లో పలు చోట్ల సభలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయన ఎదుట తమ ఆవేదన వెలి బుచ్చారు. దీంతో కలెక్టర్ అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని, అనర్హులకు పథకాలు అందవని నచ్చచెప్పారు. దరఖాస్తుల స్వీకరణ, మంజూరు ఒక్కరోజుతో ముగిసిపోవని, నిరంతరం కొనసాగుతుందని సర్దిచెప్పారు. కాగా, తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లితండాలో బుధవారం జరిగిన సభలో అర్హుల పేర్ల జాబితాలో లేకపోవడానికి కారణమంటూ కార్యదర్శి ప్రణీతను పలువురు నిలదీశారు. దీంతో భయంతో ఆమె గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లగా కాసేపటికి బయటకు వచ్చాక సైతం అడ్డుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెళ్లి నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
కిటకిటలాడిన గ్రామసభలు
మూడోరోజైన గురువారం గ్రామసభల వద్ద జన సందోహం కనిపించింది. చాలా చోట్ల ప్రజలు నిరసనలు తెలిపారు. జాబితాల్లో పేర్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో బారులు దీరి సమర్పించారు.
పథకాల వారీగా మూడు రోజుల్లో అందిన దరఖాస్తులు
పథకం మంగళవారం బుధవారం గురువారం ఇందిరమ్మ ఇళ్లు 14,783 18,777 17,444
రేషన్‌కార్డులు 15,721 17,962 17,088
రైతుభరోసా 1,565 2,147 1,701
ఆత్మీయ భరోసా 9,213 13,943 12,340
మొత్తం 41,282 52,829 48,571
Comments
Please login to add a commentAdd a comment