ముగిసిన గ్రూపు–2 పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండోరోజు అభ్యర్థుల హాజరు భారీగా తగ్గింది. సోమవారం 55శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు పేపర్లుగా నిర్వహించిన గ్రూపు– 2 పరీక్షల కోసం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో మొత్తం 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన కారణంగా తొలిరోజు ఆదివారం పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం కాగా, రెండోరోజు అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 4,393 మంది అభ్యర్థులకు 2,395 మంది హాజరయ్యారు. 1,998 మంది గైర్హాజరయ్యారు. ఇక సాయంత్రం నిర్వహించిన పరీక్షకు 2,397 మంది హాజరు కాగా, 1996 గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.
కేంద్రాలు పరిశీలన
జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ స్కూల్, బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. పరీక్ష తీరు, హాజరుశాతం గురించి అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్‌రూంకు ఓఎంఆర్ షీట్ల తరలింపుపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఆసిఫాబాద్‌లోని పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు చేసినట్లు తెలిపారు. అలాగే జన్కాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. కాగా.. సాయంత్రం పరీక్ష ముగిసిన తర్వాత ఆయా కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్లను కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంకు బందోబస్తు మధ్య తరలించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పరీక్షల నోడల్ అధికారి లక్ష్మీనరసింహ స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment