చర్చలు విఫలం.. సమ్మె ఉధృతం!
● స్పష్టమైన హామీ ఇవ్వని సర్కారు ● కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసనలు
సమ్మె కొనసాగిస్తాం
సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. అప్పటివరకు పేస్కేల్ అమలు చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– శృతిక, సమగ్ర శిక్షా
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు
కెరమెరి/ఆసిఫాబాద్‌రూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర కమిటీ నాయకులు సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు. అదేరోజు రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిశారు. అయితే సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎనిమిదో రోజుకు సమ్మె
జిల్లాలో మొత్తం 488 మంది సమగ్ర శిక్షాలో ఉద్యోగులు ఉంన్నారు. ఇందులో డీపీవో సిబ్బంది ఆరుగురు, కేజీబీవీల్లో 334, ఎమ్మార్సీ కార్యాలయాల్లో 68, కాంప్లెక్స్ పరిధిలో 80 కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీరు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ఉద్యోగా లు క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు మినిమం పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యమానికి కొత్త రూపు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్సీ కార్యాలయాల్లో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో తాత్కాలికంగా పనులు చేపట్టాలని ఆదేశాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. 15 కస్తూరిబా విద్యాలయాల నుంచి 60శాతం మంది ఉద్యోగులు నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇక నుంచి వందశాతం టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సైతం సమ్మెలో పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment