● కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన ● ఆలస్యంగా వెలుగులోకి..
కోటపల్లి: తరగతి గదిలో ఉపాధ్యాయురాలు పాఠం చెబుతుండగా డౌట్ అడిగినందుకు విద్యార్థిని చితకబాదిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఇటీవల ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించగా విద్యార్థులు తమ బాధలను చెప్పుకున్నారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గణితంలో పాఠం అర్థం కాక మళ్లీ ఒకసారి చెప్పండి మేడం అనగానే సదరు ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదినట్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు కింద ప్రభుత్వంకు చెల్లించేందుకు సుమారు రూ.125 ఉండగా ఈ పాఠశాలలో మాత్రం సదరు ఉపాధ్యాయురాలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.400 వసూలు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇలా కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై పాఠశాల హెచ్‌ఎం అశోక్‌ను వివరణ కోరగా విద్యార్థిని కొట్టిన విషయం తెలుసుకుని సదరు ఉపాధ్యాయురాలిని మందలించి ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. పరీక్ష ఫీజు రూ.400 అనేది కొంతమంది వద్ద మాత్రమే ఇతరత్రా ఖర్చులకు తీసుకున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment