జిల్లాకు చేరిన ప్రజా రగ్ జోళ్ యాత్ర
రెబ్బెన(ఆసిఫాబాద్): సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 8న కొత్తగూడెంలో ప్రారంభమైన ప్రజా రగ్ జోళ్ యాత్ర మంగళవారం జిల్లాకు చేరింది. రెబ్బెన మండలం గోలేటి విలేజ్‌లోని జగదాంబ ఆలయంలో సంప్రదాయ పూజలు నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ చంద్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్, నాయకులు జగదాంబ దేవిని దర్శించుకున్నారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభకు సేవాలాల్ దీక్ష గురువు శ్రీప్రేమ్‌సింగ్ మహరాజ్ హాజరయ్యారు. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ బంజారాలు మాట్లాడే బోర్‌బోలీ భాషను అధికార భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గిరిజనులపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దాడులను అరికట్టాలన్నారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభమైన ప్రజా రగ్ జోళ్ యాత్ర ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు మంచిర్యాల జిల్లాలో పూర్తి చేసుకుని కుమురంభీం జిల్లాలో అడుగుపెట్టిందని తెలిపారు. ఈ నెల 26న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ముగుస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, రాథోడ్ రఘురాం నాయక్, రవి రాథోడ్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శులు లావుడ్య మోహన్, జిల్లా అధ్యక్షుడు రూప్లా నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, గ్రామస్తులు కునుసోత్ బిక్కు నాయక్, లావుడ్య దుప్పానాయక్, జర్పుల రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment