మారిన రాజకీయం
● లోక్‌సభ ఎన్నికలు విజయవంతం ● పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు, నాయకులు ● సర్కారు ఏర్పడి ఏడాదైనా దక్కని మంత్రి పదవి ● ఎన్నో మార్పులకు వేదికై న 2024
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాల చక్రం గిర్రున తిరిగింది. 2024 సంవత్సరం అప్పుడే పూర్తవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక రాజకీయ మార్పులను చరిత్రలో నమోదు చేసింది. గత ఏడాది శాసనసభ ఎన్నికలు జరగ్గా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ఫలి తాల అనంతరం రాజకీయంగా అనేక మార్పులను తీసుకొచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోగా.. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. బీఆర్‌ఎస్ పార్టీ రెండు స్థానాల్లో ఓటమితో ప్రాతినిధ్యం కోల్పోయింది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయి.
వరించిన పదవులు
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలువురికి రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యత దక్కింది. జనవరిలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు రాజకీయంగా ఈ ప్రాధాన్యత దక్కింది. గత జూలైలో దండేపల్లి మండలానికి చెందిన కోట్నాక తిరుపతి రాష్ట్ర గిరిజన సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం అయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఈయన ఒక్కరికే నామినేటెడ్ పదవి దక్కడం గమనార్హం. ఇక సింగరేణి కార్మిక సంఘ నాయకుడు ఐఎన్టీయూసీ సీనియర్ నేత జనక్‌ప్రసాద్‌కు రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా అవకాశం దక్కింది. వీరు తప్ప మిగతా ఎవరికీ రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కలేదు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
గోడ దూకిన లీడర్లు..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, ఈ ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. తమకు కలిసి వచ్చే పార్టీ కండువాలు కప్పుకున్నారు. గత ఫిబ్రవరిలో మాజీ ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరి పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో రెండున్నర నెలల్లోనే మళ్లీ బీజేపీలో చేరారు.
● బీఆర్‌ఎస్ నాయకుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి మార్చి 21న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
● మార్చిలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ గోడం నగేశ్ బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ ఆదిలాబాద్ టికెట్ ఇవ్వడంతో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
● ఇక బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల స మయంలోనే ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరా రు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బీఆర్‌ఎస్ లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరారు. అదే సమయంలో మాజీ మంత్రి, సీనియర్ నేత ఇంద్రకరణ్‌రెడ్డి గులా బీ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఏడాది చివరలో బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ సోయం బా పూరావు, బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ గూటికి చేరారు.
స్థానిక సంస్థల ఎన్నికలు లేవు..
స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయని కింది స్థాయి నాయకులు ఆశించినప్పటికీ జాప్యం జరిగింది. తాజా, మాజీలు, నాయకులు కొత్త ఏడాదిలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్ కూడా ఏర్పడితే తొలిసారిగా కొత్త ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
పొలిటికల్
ఊరించిన మంత్రి పదవి
అదిగో ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటుండగానే ఏడాదికాలం గడిచిపోయింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేల మధ్య మంత్రి పదవీ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈ ఏడాదిలో విస్తరణ జరగకపోవడంతో ఉమ్మడి జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఊరించి ఉసూరుమనిపించింది. కొత్త ఏడాదైనా ఉమ్మడి జిల్లా నాయకుల్లో ఎవరికై నా మంత్రి యోగం ఉంటుందో..! లేదో..! అనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment