అధ్వానంగా హాస్టళ్లు
జాగ్రత్తలు తీసుకుంటాం
బీసీ వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సంబంధిత వార్డెన్లు 24 గంటలపాటు వసతిగృహాల్లోనే ఉండే విధంగా చూస్తాం. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
– సజీవన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహంలో చదువుకుంటున్న విద్యార్థిని వెంకటలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో జిల్లాలో వసతిగృహాల్లోని వసతుల లేమి మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చౌదరి శైలజ అస్వస్థతకు గురై మృతి చెందిన 25 రోజుల వ్యవధిలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
11 బీసీ వసతి గృహాలు
జిల్లావ్యాప్తంగా 11 బీసీ డే కేర్ వసతి గృహాలు ఉన్నాయి. 2024– 25 విద్యా సంవత్సరంలో 850 మంది బాలబాలికలు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పాఠశాలాలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. ప్రీమెట్రిక్ వసతి గృహాలు ఏడు ఉండగా అందులో ఆరు బాలురకు చెందినవి ఉన్నాయి. ఆయా చోట్ల 546 మంది విద్యార్థులు, బాలికల వసతి గృహంలో 18 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఇక నాలుగు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 292 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో రెండు బాలిక వసతి గృహాల్లో 134మంది, రెండు బాలుర వసతి గృహాల్లో 158 మంది విద్యను అభ్యసిస్తున్నారు.
సౌకర్యాలు లేక అవస్థలు
జిల్లాలోని మొత్తం 11 బీసీ వసతి గృహల్లో ఆరు అద్దె భవనంలో కొనసాగుతుండగా, ఐదింటికి సొంత భవనాలు ఉన్నాయి. ఆయా చోట్ల సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలు ఉన్నవాటిలో కూడా వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్ బాలుర హాస్టల్, వాంకిడి బీసీ బాలుర, కెరమెరి బాలుర, కౌటాల బాలుర వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కిటికీలకు తలుపులు లేవు. వర్షాకాలంలో భవనాలు ఉరుస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చన్నీటితో స్నానాలు చేస్తూ ఏటా వణుకుతున్నారు. సమస్యలు ఉన్నతాధికారులు, వార్డెన్లకు చెప్పినా ఉపయోగం ఉండటం లేదు. మరమ్మతులకు నిధులు మంజూరు కావడం లేదని చెబుతున్నారు. ఆర్వో ప్లాంట్లు, గదులకు మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో వసతుల లేమి
సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment