● ఈ నెల 26 నుంచి సాగుకు యోగ్యమైన భూములకు పెట్టుబడి సాయం ● భూమిలేని వారికి ‘ఇందిరమ్మ ఆర్థిక భరోసా’ ● ఎదురుచూస్తున్న జిల్లా రైతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): రైతాంగం ఏడాదిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 26 నుంచి పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతంలో ఏడాదికి ఎకరానికి రూ.10వేలు అందించగా, ప్రస్తుతం ఎకరానికి రూ.12వేలు చెల్లించనున్నారు. ఇప్పటివరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా, ఇక నుంచి భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా వర్తింపజేయనున్నారు.
ఎకరానికి రూ.12వేలు
కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి రూ.12వేలకు కుదించారు. అలాగే గత ప్రభుత్వం రైతుబంధు అమలులో ఎలాంటి షరతులు విధించకుండా గుట్టలు, కొండలు, వెంచర్లు.. ఇలా భూమి ఉన్న ప్రతిఒక్కరికి రైతుబంధు అమలు చేసింది. వ్యవసాయం చేయని వారికి కూడా రైతుబంధు అమలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. గతంలో జిల్లాలో 1,37,808 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.2,22,08,70,972 సాయం అందించింది. తాజాగా నిర్ణయంతో జిల్లాలో రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య తగ్గనుంది. రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల వారీగా రైతుల వివరాలను సేకరించనున్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రజల సమక్షంలో వివరాలు వెల్లడించనున్నారు. అయితే ఒకే దఫాలో రూ.12వేలు అందిస్తారా.. లేక రెండు దఫాల్లో చెల్లిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
భూమిలేని వారికీ..
సొంతంగా భూములు లేకున్నా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవించే కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. ప్రభుత్వం ఇందిరమ్మ ఆర్థిక భరోసా పథకం పేరుతో భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం ఏటా ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఏటా రూ.12వేల చొప్పున అందిస్తామని, ఈ పథకాన్ని కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారం పథకాలు అమలు చేయనున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో భూమి లేని వ్యవసాయ కుటుంబాలు సుమారు 40వేల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గ్రామాల్లో వారికి ఏ ప్రాతిపదిక గుర్తిస్తారు.. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.
మిగిలింది 20 రోజులే..
రైతు భరోసా, ఇందిరమ్మ ఆర్థిక భరోసా పథకాల అమలుకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నిర్ణీత సమయంలోగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలను గుర్తించాలి.. సాగుకు యోగ్యమైన భూముల వివరాల లెక్కతేల్చాలి.. గ్రామసభలను నిర్వహించి లబ్ధిదారుల వివరాలను ప్రజల ముందుంచాలి.. ఈ ప్రక్రియంతా చేపట్టేందుకు గడువు సరిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పంచాయతీరాజ్ అధికారులు చేపడుతున్నారు. రైతుభరోసా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే దానిపైనా స్పష్టతలేదు. రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment