అరచేతిలో ‘ఉపాధి’ సమాచారం
● ఉపాధిహామీ పనుల్లో పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి ● అందుబాటులోకి జన్‌మన్‌రేగా యాప్ ● కూలీలు సైతం వేగంగా వివరాలు తెలుసుకునే అవకాశం ● జిల్లాలో 1,23,010 జాబ్‌కార్డులు
అవగాహన కల్పిస్తాం
జనమన్‌రేగా యాప్ వినియోగంపై ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తాం. ఈ యాప్ ద్వారా కూలీలు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా గ్రామాల్లో ఎఫ్‌ఏలు, టీఏల ద్వారా ప్రచారం చేస్తాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
ఆసిఫాబాద్‌అర్బన్: వలసలు అరికట్టేందుకు ప్రా రంభించిన ఉపాధిహామీ పథకం ఏటా లక్షలాది మంది కడుపు నింపుతోంది. మరోవైపు అక్రమాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం సరికొత్త నిబంధనలు అమలు చేస్తూ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. కూలీలు సైతం అరచేతిలో వేగంగా వివరాలు తెలుసుకునే విధంగా జన్‌మన్‌రేగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందూ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది.
జిల్లాలో 1,23,010 జాబ్‌కార్డులు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 1,23,010 జాబ్‌కార్డులు ఉండగా ఇందులో 1,23,010 కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే మొత్తం 2,44,026 కూలీల్లో 1,70,396 మంది పనులకు వస్తున్నట్లు ఈజీఎస్ అధికారులు తెలిపారు. జిల్లాలో యాసంగిలో పంటల సాగు అంతంతే ఉంటుంది. దీంతో వర్షాకాలం పంటల సీజన్ ముగిసిన తర్వాత ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్తుంటారు. కూలీల ఖాతాలు సక్రమంగా లేకపోవడం, కూలి నగదు ఖాతాల్లో జమ కాకపోవడం, ఇతర సమస్యలతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు జన్‌మన్‌రేగా యాప్ ద్వారా నగదు చెల్లింపులకు కారణాలను కూడా తెలుసుకోవచ్చు. కుటుంబానికి సంబంధించిన వివరాలనూ సరిచూసుకోవచ్చు.
మరింత పకడ్బందీగా..
ఉపాధిహామీ పనుల్లో ఏటా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు సామాజిక తనిఖీలు చేపట్టి గ్రామసభల్లో పనుల వివరాలు వెల్లడిస్తూ అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. అయితే నిధుల రికవరీ మాత్రం పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పథకం అమలులో అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కూలీల లైవ్ లొకేషన్‌తో ఫొటో అప్‌లోడ్ చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది. ఆన్‌లైన్ హాజరుతో చాలా వరకు అవకతవకలకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు ఉపాధిహామీ పథకానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు జన్‌మన్‌రేగా యాప్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ, కుటుంబం గుర్తింపు నంబర్ వివరాలు ముందుగా నమోదు చేయాలి. పేమెంట్ ఆప్షన్‌లో వ్యక్తి పేరు మీద క్లిక్ చేస్తే ఎక్కడ పని చేశారు.. పని దినాల సంఖ్య.. వేతనం ఎంత.. ఎప్పుడు జమైంది.. ఏ బ్యాంకు ఖాతా ఉంది.. అనే వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అలాగే ఆధార్ నంబర్ లింకు అయిందా లేదా.. ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టం లింకు అయిందో కూడా సరి చూసుకోవచ్చు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే పచ్చరంగు కనిపిస్తుంది. సమస్య ఉన్నచోట ఎరుపు రంగు చూపుతుంది. అలాగే జాబ్‌కార్డులోని కుటుంబ సభ్యుల పని వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు పనిచేశారు.. కుటుంబంలో ఎవరు ఎన్ని రోజులు పనికి వచ్చారు అనే వివరాలు స్పష్టంగా చూపిస్తుంది. కూలీలకు పూర్తి వివరాలు తెలిస్తే అక్రమాలు జరిగిన సమయంలో సిబ్బంది, అధికారులను నిలదీసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment