టీచర్లు వెళ్లిపోయారు..! | - | Sakshi
Sakshi News home page

టీచర్లు వెళ్లిపోయారు..!

Published Fri, Jan 24 2025 1:21 AM | Last Updated on Fri, Jan 24 2025 1:21 AM

టీచర్లు వెళ్లిపోయారు..!

టీచర్లు వెళ్లిపోయారు..!

● స్పౌజ్‌ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం ● జిల్లా నుంచి ఇతర జిల్లాలకు 59 మంది బదిలీ ● వచ్చింది మాత్రం ఒక్కరే..

ఆసిఫాబాద్‌రూరల్‌: 317 జీవోతో స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్‌ కేటగిరీ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 20న రాష్ట్ర విద్యాశాఖ జీవో జారీ చేసింది. అయితే ఈ బదిలీలతో జిల్లాలో మళ్లీ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కుమురంభీం ఆసిఫాబాద్‌ నుంచి అత్యధికంగా 59 మంది ఉపాధ్యాయులు బయటికి వెళ్లిపోవడంతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

317 జీవోతో 628 మంది జిల్లాకు..

మూడేళ్ల క్రితం విడుదలైన 317 జీవో కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు ఇష్టం లేకున్నా స్థానికతను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా మందిని ప్రభుత్వం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు కేటాయించింది. 2022లో 628 మంది టీచర్లు ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని జీవో 317కు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. చర్చల అనంతరం మొదటగా 317 స్పౌజ్‌ టీచర్ల బదిలీలకు అనుమతించింది. విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతి సెలవుల అనంతరం స్పౌజ్‌ బదిలీల ఉత్తర్వులు జారీ చేసింది.

ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన

జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం స్పౌజ్‌, అనారోగ్యం, పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. 317 జీవోతో జిల్లాకు వచ్చిన వారు 628 మంది ఉండగా.. స్పౌజ్‌ బదిలీల కోసం జిల్లా నుంచి 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర జిల్లాలో ఖాళీలకు అనుగుణంగా సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని జాబితా ప్రకటించారు. 2022 మార్చిలో పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వగా.. తాజాగా మరోసారి అవకాశం కల్పించారు. ఖాళీలకు అనుగుణంగా స్పౌజ్‌ కేటగిరిలో అవకాశం దొరకని వారు పరస్పర బదిలీలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మ్యూచువల్‌ స్పౌజ్‌ బదిలీల కోసం 150 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, 59 మంది మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలకు వెళ్లే అవకాశం వచ్చింది. బుధవారం డీఈవో కార్యాలయంలో నాలుగు బృందాలు, ఎనిమిది మంది గెజిటెడ్‌ హెచ్‌ఎంలు, ఎంఈవో సుభాష్‌ తదితరులు బదిలీ ఉపాధ్యాయుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఇందులో ఎస్జీటీలు 54 మంది, స్కూల్‌ అస్టింటెంట్లు ఐదుగురు ఉన్నారు. ఆదిలాబాద్‌కు 30 మంది, మంచిర్యాలకు 29మంది ఉపాధ్యాయులు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచి ఓ మహిళా ఉపాధ్యాయురాలు జిల్లాకు వచ్చారు.

మరిన్ని ఖాళీలు..

జిల్లావ్యాప్తంగా 704 ప్రభుత్వ పాఠశాలలో 37,948 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇటీవల 320 మంది స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 281 మంది ఉపాధ్యాయులను నియమించింది. ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. స్పౌజ్‌ బదిలీల్లో వెళ్లినవారిలో 55 మంది స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లే ఉండటం గమనార్హం.

అందరికీ న్యాయం చేయాలి

ప్రభుత్వం చేపట్టిన మ్యూచువల్‌ స్పౌజ్‌ బదిలీలతో కొంతమంది టీచర్లకు మాత్రమే అవకాశం దక్కింది. జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతోంది. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలి. డిస్‌ లొకేటెడ్‌ స్థానికత ప్రాతిపదికన ఎవరైతే ఇతర జిల్లాల్లో ఉన్నారో వారిని తక్షణమే సొంత జిల్లాలకు పంపించాలి.

– శాంతికుమారి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు

ఇబ్బంది లేకుండా చర్యలు

స్పౌజ్‌ బదిలీలతో జిల్లా నుంచి 58 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. వారి స్థానంలో వేరే ప్రాంతం వారితో సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

– యాదయ్య, డీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement