మహాపూజకు సిద్ధం
● నేడు పవిత్ర గంగాజలంతో మర్రి చెట్టు వద్దకు మెస్రం వంశస్తులు ● ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసిన వివిధ శాఖల అధికారులు ● 28న నాగోబా జాతర ప్రారంభం
చర్చవేదికకు శుద్ధి పూజ
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో నూతనంగా నిర్మించిన గాది (చర్చావేదిక)కు గురువారం సాయంత్రం మెస్రం వంశ పెద్దలు శుద్ధి పూజలు నిర్వహించారు. ముందుగా నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ ఆధ్వర్యంలో పవిత్రమైన కోనేరు నుంచి పవిత్ర జలంతో గాదిని శుద్ధి చేశారు. కటోడ (పూజారి) మెస్రం కొసేరావ్ చేతుల మీదుగా చర్చావేదికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మెస్రం చిన్నుపటేల్, దాదారావ్, దేవ్‌రావ్, జంగుపటేల్ తదితరులున్నారు.
ఇంద్రవెల్లి: మహాపూజలతో ఈ నెల 28న ప్రారంభించనున్న కేస్లాపూర్ నాగోబా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 17న పవిత్ర గంగాజలం సేకరించిన వారు ఈ నెల 24న ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పొలిమేరలోని మర్రి చెట్టుకు చేరనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా ఆలయాభివృద్ధికి రూ.3.60కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇటీవల సీఎస్ శాంతికుమారిని కలిసి నిధుల కోసం విన్నవించారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు దేవాదాయశాఖ ఈవో రాజమౌళి తెలిపారు.
నేడు మర్రి చెట్టు వద్దకు..
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు శుక్రవారం తెల్లవారుజామున ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి కేస్లాపూర్ గ్రామ సమీపంలోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు. ఈ నెల 25, 26, 27 వరకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూమ్ పూజలు చేయనున్నారు. ఈ నెల 28న రాత్రి పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని మెస్రం వంశీయులు మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నారు. జనవరి 31న దర్బార్ నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
నాగోబా జాతర నిర్వహణకు ఆర్‌డబ్ల్యూఎస్, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరాయి. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పనుల కోసం సుమారు రూ.24లక్షలతో ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపించారు. ఈసారి రెండు బోర్లు వేయించారు. మర్రి చెట్టు, గోవడ్, దర్బార్ హాల్, పోలీస్ క్యాంప్ వద్ద తాత్కాలికంగా 38 స్నానపు గదులు, 15 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మెస్రం వంశీయుల కోరిక మేరకు ఈసారి అదనంగా 30 తాత్కాలిక స్నానపు గదులు ఏర్పాటు చేశారు. మర్రి చెట్టు, గోవడ్ సమీపంలో 48 శాశ్వత మరుగుదొడ్లు, 10 స్నానపు గదులకు మరమ్మతులు చేపట్టారు. జాతర నిర్వహణ స్థలం, మెస్రం వంశీయులు బస చేసే మర్రి చెట్టు, గోవడ్ పరిసర ప్రాంతాలను చదును చేశారు. మర్రి చెట్టు వద్ద ఉన్న పవిత్ర జలం కోనేరు, గోవడ్‌ను రంగులతో ముస్తాబు చేశారు. ఆలయ సమీపంలోని హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. నాగోబా ఆలయ అలంకరణ, టెంట్లు వేసే పనులను ముమ్మరం చేశారు. కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment