![టెండర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10skn126-340017_mr-1739214753-0.jpg.webp?itok=IRAPkQdD)
టెండర్లు ఆలస్యం!
● తునికాకు సేకరణపై అధికారుల నిర్లక్ష్యం ● ఇప్పటికీ ప్రారంభంకాని ప్రక్రియ ● గతేడాది చెల్లింపుల్లో కూడా తీవ్ర జాప్యం ● గుత్తేదార్లు, కూలీల్లో ఆందోళన
చింతలమానెపల్లి(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఉపాధి తునికాకు సేకరణ.. జిల్లాలో విస్తారంగా అడవులు ఉండటంతో వేసవిలో గిరిజనులు, గిరిజనేతరులు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ఏడాది తునికాకు సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. అటవీశాఖ కూడా ఆ దిశగా కసరత్తు ప్రారంభించకపోవడంతో కూలీలు, గుత్తేదార్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ అటవీ డివిజన్లు పరిధిలో మొత్తం పది రేంజ్‌లు ఉండగా, 2,437 చదరపు కిలోమీటర్ల మేర అటవీప్రాంతం ఉంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లోని కాగజ్‌నగర్, సిర్పూర్(టి), ఖర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌ల పరిధిలో గల 13 యూనిట్లలో తునికాకు సేకరణ చేపడుతున్నారు. బెజ్జూర్, సలుగుపల్లి, గూడెం, ఖర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట్, కొత్తపేట్, అనుకోడ, పెంచికల్‌పేట్, లోనవెల్లి, కడంబా, బొంబాయిగూడ, డబ్బా యూనిట్ల పరిధిలో మొత్తం 157 తునికాకు కల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది రెండు యూనిట్ల పరిధిలో వివిధ కారణాలతో తునికాకు సేకరణ చేపట్టలేదు.
మొదలుకాని ప్రక్రియ
తునికాకు సేకరణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించాల్సి ఉంటుంది. ఏటా జనవరిలో కల్లాల నిర్వహణకు టెండ ర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం కొత్త చిగురు వచ్చేందుకు కొమ్మ కొట్టడం వంటి పనులు నిర్వహించాలి. ఇదంతా జనవరిలోనే పూర్తి చేయాల్సి ఉంటుందని కూలీలు చెబుతున్నారు. కానీ నేటివరకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదు. ఏటా అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ప్రధానంగా ఆదివాసీ గిరిజనులు తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కట్టకు రూ.9 నుంచి రూ.13 వరకు ప్రాంతాలను అనుసరించి చెల్లిస్తున్నారు. స్థానికంగా మాత్రం కట్టకు రూ.3 నుంచి రూ.6 వరకు మాత్రమే కూలీలకు అందుతుంది. వేసవిలో ఉపాధి అందించే తునికాకు సేకరణ పనులు త్వరగా ప్రారంభించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది చెల్లింపులు పెండింగ్
గతేడాది తునికాకు సేకరణలో అధికారుల వైఫల్యంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. తునికాకు సేకరణ నుంచి నమోదు వరకు అంతా అటవీశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. తునికాకు సేకరించిన కూలీల నుంచి కట్టలు రోజువారీగా సేకరించి వివరాలు నమోదు చేస్తారు. కూలీల సంఖ్య, తునికాకు కట్టలు బేరీజు వేసుకుని లెక్క నిర్వహిస్తారు. ఈ వివరాలను ఎఫ్‌బీవో ఎఫ్‌ఎస్‌వోకు నివేదిస్తారు. జాబితాను ఎఫ్‌ఆర్‌వోకు అందించగా రేంజ్ అధికా రి యూనిట్ల వారీగా వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తారు. ఈ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. గతేడాది కాగజ్‌నగర్ డివిజన్‌లో 20,600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు లక్ష్యం నిర్దేశించగా రెండు యూనిట్లలో సేకరణ చేయలేదు. ఈ కారణంగా లక్ష్యాన్ని 17,700 బ్యాగులకు తగ్గించా రు. 14,352 బ్యాగుల తునికాకు మాత్రమే సేకరించారు. వీటికి రూ.4.30 కోట్ల నగదును కూలీలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగకపోవడం గమనార్హం. ఈ ఏడాది సేకరించాల్సిన తునికాకు లక్ష్యం సైతం అధికారులు, ప్రభుత్వం నిర్ణయించలేదని తెలుస్తోంది.
ఆందోళన వద్దు
తునికాకు సేకరణపై ఎలాంటి ఆందోళన వద్దు. రాష్ట్రవ్యాప్తంగా తునికాకు సేకరించే అన్ని జిల్లాల్లో ప్రక్రియ ఒకేసారి నిర్వహిస్తారు. ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. కొమ్మ కొట్టడం అనేది టెండర్ల అనంతరమే ఉంటుంది. తునికాకు సేకరణకు విరుద్ధంగా మా కార్యాలయం నుంచి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. టెండర్ల అనంతరం స్థానికంగా గుత్తేదార్లతో ఒప్పందం చేసుకుని, అన్నిరకాల అనుమతులు ఇస్తాం.
– సుశాంత్ బొగాడె, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
వెంటనే మొదలు పెట్టాలి
తునికాకు సేకరణపై ఆధారపడి ఏటా ఆదివాసీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అవకాశాలు లేని గ్రామాల ప్రజలకు తునికాకు సేకరణ ఉపయోగపడుతోంది. ఇప్పటికే అటవీశాఖ టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే పనులు ప్రారంభించాలి.
– బుర్రి రూపేశ్, ఆదివాసీ సంఘం నాయకుడు
![టెండర్లు ఆలస్యం!1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10skn127-340017_mr-1739214753-1.jpg)
టెండర్లు ఆలస్యం!
Comments
Please login to add a commentAdd a comment