![భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bmp02-340077_mr-1739214754-0.jpg.webp?itok=L19y6Bjl)
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా
● నేటి నుంచి యఽథాతథంగా నడపనున్న రైల్వే శాఖ ● రైల్వే ఫోరం సభ్యుల ట్వీట్‌లకు స్పందించిన అధికారులు ● రద్దు నిర్ణయం ఉపసంహరణ
బెల్లంపల్లి: సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబరు 17233, 17234)ను యథాతథంగా నడపడానికి రైల్వే అధి కారులు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 నుంచి 20వరకు 11రోజులపాటు రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర తెలంగాణకు చెందిన రైల్వేఫోరం సభ్యులు, ప్రయాణికులు ‘ఎక్స్’ వేదికగా పెద్ద ఎత్తున రైల్వేశాఖకు ట్వీట్ చేయడంతోపాటు ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్ సంప్రదింపులు జరిపారు. అనివార్య పరిస్థితుల్లో రైల్వే అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి పట్టాలపై పరుగులు తీసేలా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ పచ్చజెండా ఊపారు.
రైల్వే అధికారుల తీరుపై వెల్లువెత్తిన విమర్శలు
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధి ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా రైల్వే అధికారులు రైళ్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30 రైళ్లను వివిధ తేదీల్లో రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపాలని నిశ్చయించారు. మరి కొన్ని రైళ్లు ఆలస్యంగా బయల్దేరుతాయని ప్రకటించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో చేపట్టనున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయినా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలుతో ముడిపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తీరును నిరసిస్తూ ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు, మంచిర్యాల, పెద్దపల్లి, జమ్మికుంట, రామగుండం, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి రైల్వే ప్రయాణికులు ఎక్స్ వేదికగా రైల్వే ఉన్నతాధికారులపై దుమ్మెత్తి పోశారు. ఖమ్మం వైపు మూడో రైల్వేలైన్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడితే కాజీపేట– బల్లార్షా మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఏమిటని తప్పుడు నిర్ణయాన్ని ఎత్తి చూపారు. ఈ అంశంపై ‘సాక్షి’ దినపత్రిక ఈ నెల 8న ‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు’ శీర్షికన ప్రయాణికుల పక్షాన రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయాన్ని ప్రధానంగా ప్రస్తావించి పాఠకులకు కదిలించిన సంగతి తెలిసిందే. అనేకమంది సాక్షి కథనం క్లిప్పింగ్‌ను జోడించి రైల్వే అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. రైలు రద్దుతో ఈ మార్గంలో ప్రయాణం సాగించే ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని, వెంటనే రైలు రద్దు ఉత్తర్వులను వెనక్కి తీసుకుని యధాతథంగా నడిపించాలని సూచించింది. మొత్తానికి ఎంపీ సంప్రదింపులు, రైల్వే ఫోరం సభ్యులు, ప్రయాణికుల ట్వీట్‌లు, సాక్షి దినపత్రిక కథనం రైల్వే అధికారుల మనసు మార్చుకునేలా చేసి సమస్య పరిష్కారానికి దారి చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment